ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ

Gram Volunteer Posts Has More Competition In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలో గ్రామ వలంటీరు పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 909 గ్రామ పంచాయతీల్లో 14,118 పోస్టులు ఉన్నాయి. వీటికి మొత్తం 83,123 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల 1,515 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.  24 పరిశీలనలో ఉన్నాయి. మిగిలిన 81,584 ఇంటర్వ్యూకు అర్హత సాధించాయి.  అభ్యర్థులకు గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 800 దరఖాస్తులకు మించి ఉన్న మండలాల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేందుకు కలెక్టర్‌ అదనపు కమిటీలను ఏర్పాటు చేశారు.

సాధారణంగా ప్రతి మండలంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓఆర్‌డీలతో ఏర్పాటైన కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే.. 800 కంటే ఎక్కువ దరఖాస్తులు ఉన్న మండలాల్లో ఈ కమిటీతో పాటు మండల ప్రత్యేకాధికారి, వ్యవసాయాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈతో ఒక కమిటీ, ఇంకా ఎక్కువ దరఖాస్తులు ఉంటే పీఆర్‌ డీఈ, డిప్యూటీ తహసీల్దార్, పీఆర్‌ ఏఈతో మరో కమిటీ ఉంటుంది.  ఈ 20 మండలాల్లో... : 20 మండలాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా వాటిలో మూడు కమిటీల చొప్పున ఇంటర్వ్యూలు చేయనున్నాయి.

ఈ జాబితాలో ఓర్వకల్లు, అవుకు, వెల్దుర్తి, సీ బెళగల్, ఆస్పరి, నంద్యాల, డోన్, తుగ్గలి, ప్యాపిలి, నందవరం, ఆదోని, కల్లూరు, బేతంచెర్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, గోనెగండ్ల, కర్నూలు మండలాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో మండలంలో 1,600కు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు కమిటీలు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పోస్టులను కేటాయిస్తున్నారు.
మొత్తం పోస్టులు : 14,118
బీసీ : 4,092,
ఎస్సీ : 2,120,
ఎస్టీ : 850,
పీహెచ్‌సీ : 422,
జనరల్‌ :  6,634 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top