సీఎం రమేష్‌కు న్యాయం.. అధికారులకు అన్యాయం

Govt has taken Loose actions about CM Ramesh issue - Sakshi

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ సంస్థ పనులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేసిన సొమ్మును వసూలు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కానీ అక్రమ చెల్లింపులకు బాధ్యులైన చీఫ్‌ ఇంజనీర్, ఎస్‌ఈ, ఈఈలపై మాత్రం చర్యలు తీసుకుంది. వివరాల్లోకెళ్తే.. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశకు 2004లో టెండర్లు పిలిచారు. అప్పట్లో సీఎం రమేష్‌ సంస్థ రిత్విక్‌ ప్రాజెక్ట్స్ చిన్న సంస్థ కావడంతో టెండర్లలో పాల్గొనే అవకాశం కూడా ఆ సంస్థకు లేకపోయింది. దీంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.42 కి.మీ. నుంచి 20 కి.మీ. వరకూ తవ్వకం) పనులను బ్యాక్‌బోన్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థను ముందు పెట్టి రూ.47 కోట్లకు సీఎం రమేష్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ పనులను సీఎం రమేష్‌ సంస్థ సబ్‌ కాంట్రాక్టు కింద చేపట్టింది. హంద్రీ–నీవా తొలి దశలో అన్ని ప్యాకేజీల పనులు 2009 నాటికే పూర్తయినా 23వ ప్యాకేజీ పనులు చేయడంలో మాత్రం రిత్విక్‌ ప్రాజెక్ట్స్ మొండికేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2012లో తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది.

మిగిలిపోయిన పనులు పూర్తి చేసే క్రమంలో పనులు చేయకపోయినా చేసినట్లు చూపి రూ.5.91 కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పటి ప్రభుత్వం ఈఎన్‌సీ రెహమాన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసిన ఈ కమిటీ సీఎం రమేశ్‌ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. అక్రమ చెల్లింపులకు బాధ్యులైన సీఈ, ఎస్‌ఈ, ఈఈలపై సస్పెండ్‌ వేటు వేసింది. చేయని పనులకు తీసుకున్న రూ.5.91 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ ప్రధాన కాంట్రాక్టర్‌ బ్యాక్‌బోన్‌ కనస్ట్రక్షన్స్‌కు సర్కార్‌ నోటీసులు ఇచ్చింది. వాటిని తాము చేయలేదని సబ్‌ కాంట్రాక్టర్‌ చేశారని ప్రధాన కాంట్రాక్టర్‌ వివరించారు. సబ్‌ కాంట్రాక్టర్‌ సీఎం రమేశ్‌ సంస్థ మింగిన నిధులను వెనక్కి ఇవ్వకపోవడంతో ప్రధాన కాంట్రాక్టు సంస్థ బ్యాక్‌బోన్‌ కనస్ట్రక్షన్స్‌ను సర్కార్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

ఈలోగా ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరింది. దీంతో అధికారులు సీఎం రమేష్‌ సంస్థ దిగమింగిన సొమ్మును వసూలు చేయలేకపోతున్నారు. కానీ.. అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం శాఖాపరమైన చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే జలవనరుల శాఖ ఇటీవల అందరికీ పదోన్నతులు ఇచ్చి.. ఆ ముగ్గురు అధికారులకు పదోన్నతి కల్పించలేదు. సీఎం రమేష్‌ సంస్థ చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆ ముగ్గురు అధికారులు వాపోతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top