కంప్యూటర్ మిథ్య


 భద్రాచలం, న్యూస్‌లైన్ :జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఆశ్రమ పాఠ శాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రభుత్వం మంగళం పాడింది. గత రెండేళ్లుగా విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించడం లేదు. నిధుల లేమి కారణంగా ఈ విషయంలో తామేమీ చేయలేమని ఐటీడీఏ అధికారులు సైతం చేతులెత్తేశారు. గిరిజన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కల్పించి, వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. దీనిపై ఎంతో శ్రద్ధ కనబరిచి భారీగా నిధులు కేటాయించారు. 


 


 అయితే  ప్రస్తుత ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోవటంతో ఇక ఈ పథకానికి మంగళం పాడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని 41 ఆశ్రమ పాఠ శాలలో ‘గిరిప్రజ్ఞ’ పేరుతో 2005లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. 3 నుంచి 9వ తరగతి వరకు చుదువుతున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా ప్రయోజనం చే కూరేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ విద్యను బోధించేందుకు పాఠశాలకు ఇద్దరు చొప్పున 82 మంది వలంటీర్లను నియమించారు. వీరికి వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద ఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. 2005 నుంచి నాలుగేళ్ల పాటు విన్‌ఫో వేవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ విద్య నిర్వహణ బాధ్యతలు చూశారు. 


 


 అయితే క్షేత్ర స్థాయిలో సరైన ఫలితాలు రాకపోవడమే కాకుండా వలంటీర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, కంప్యూటర్ల మరమ్మతులపై దృష్టి సారించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో శరత్ ఐటీడీఏ పీవోగా ఉన్న సమయంలో ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించారు. కంప్యూటర్ విద్య నిలిచిపోకూడదనే ఉద్దేశంతో ఈ బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ ద్వారా  చేపట్టాలని శరత్ నిర్ణయించారు. కొంతకాలానికి నిధుల లేమితో బోధకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోయింది. ప్రస్తుతం ఐటీడీఏ అధికారులు కూడా దీని గురించి పట్టించుకోకపోవటంతో విద్యాశాఖాధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 


 


 మాయమైన కంప్యూటర్ సామగ్రి...


 కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా బోధనకు సరఫరా చేసిన సామగ్రి మాయమైనట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు పది కంప్యూటర్లు, పది యూపీఎస్‌లు, సరిపడా సీడీలు, రెండేసి ప్రింటర్లు, మరో రెండు లేజర్ ప్రింటర్లు, రెండు డిజిటల్ కెమెరాలు, రెండు స్కానర్లు అందజేశారు. తక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఏడు చొప్పున మొత్తం 250 కంప్యూటర్లు సరఫరా చేశారు. అయితే వీటిలో కంప్యూటర్లు మినహా మరే ఇతర వస్తువులు పాఠశాలల్లో కనిపించడం లేదు. 


 


 అవి ఏమయ్యాయనే దానిపై ఇప్పటి వరకూ తగిన పరిశీలన లేకపోవటంతో మిగిలిన వస్తువులను కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఐటీడీఏ పీవోగా ప్రవీణ్‌కుమార్ ఉన్న సమయంలో కంప్యూటర్ విద్యను గాడిలో పెట్టేందుకు వీటికి మరమ్మతులు చేయించారు. ఇందుకోసం రూ.2.69 లక్షలు ఖర్చు చేశారు. అయితే రిపేర్ల పేరుతో భద్రాచలం తీసుకొచ్చిన కంప్యూటర్ సామగ్రి కొంత తిరిగి పాఠశాలలకు వెళ్లలేదనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కానీ దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టి సారించకపోవటంతో కంప్యూటర్‌లు, స్కానర్‌లు, ప్రింటర్, కెమెరాలు చాలాచోట్ల మాయమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు దీనిపై దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలే అంటున్నాయి. 


 


 జడ్పీ పాఠశాలల్లోనూ మూసివేతేనా..? 


 జిల్లా పరిషత్ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్యా బోధిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ నిధులతో దీనిని అమలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు కంప్యూటర్ విద్యాబోధన చూసే బాధ్యతను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అనే సంస్థకు అప్పగించారు. వీరి కాంట్రాక్ట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఇక జడ్పీ పాఠశాలల్లోనూ కంప్యూటర్ విద్యాబోధన అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అంతా కంప్యూటరైజేషన్‌తోనే పనులు సాగుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంలోనే ఎక్కుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన సవాలక్ష సమస్యల నడుమ సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


 


 జడ్పీ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : నాంపల్లి రాజేష్, ఏజెన్సీ డీఈవో 


  ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ సామగ్రి అంతా మరమ్మతులకు గురయ్యాయి. వీటిని రిపేర్ చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఈ ఏడాది కంప్యూటర్ విద్యాబోధన అనుమానమే. అయితే భవిష్యత్‌లో దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము.  జడ్పీ పాఠశాలల్లో ఈ నెలాఖరుతో కాంట్రాక్టు గడువు ముగుస్తున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. ఆయా పాఠశాలల్లో  పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి కంప్యూటర్ శిక్షణ ఇప్పించి విద్యా బోధన జరిగేలా దృష్టి సారించాము. 


 


 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top