
సర్పవరం(కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ... జిల్లాలోని పేద, బడుగు వర్గాలకు ఆశాదీపం...ఆ ఆశతో వచ్చినవారికి నిరాశే ఎదురవుతోంది. ఈ చిత్రం చూశారా! కాకినాడ గొడారిగుంటకు చెందిన జల్దారపు అప్పారావు ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి పడి గాయపడ్డాడు. నడవలేని స్థితికి చేరాడు.
దీంతో అతడి ముగ్గురు కుమార్తెలు తండ్రిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎముకల వార్డు నుంచి బయటకు రావడానికి వీల్ చైర్ అడిగితే ఆసుపత్రి సిబ్బంది కుదరదన్నారు.. బతిమలాడినా వారి మనసు కరగలేదు. దీంతో చేసేది లేక నడవలేని తండ్రిని ఎత్తుకొని చిన్న కుమార్తె జల్దారపు అన్నపూర్ణ ఇలా ఆసుపత్రి లోపలికి, వెలుపలికి తీసుకువచ్చింది. ఇది చూసినవారు ‘కంటే కూతురునే కనాల’ని ప్రశంసించి ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు.