ఎదురుచూపు | government department waiting for new budgets | Sakshi
Sakshi News home page

ఎదురుచూపు

May 19 2014 2:05 AM | Updated on Jun 1 2018 8:47 PM

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపుల కోసం అన్ని ప్రభుత్వ శాఖలు ఎదురుచూస్తున్నాయి.

అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపుల కోసం అన్ని ప్రభుత్వ శాఖలు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రైతులతో ముడిపడి ఉన్న వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, పట్టుపరిశ్రమ శాఖలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాతనే కేటాయింపులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు కొన్నింటిని విలీనం చేసి వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కూడా అవకాశముందన్న  ప్రచారమూ సాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో తక్షణమే రైతు సహాయక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు తక్షణమే అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సారి ‘సాగుకు సమాయత్తం’ కార్యక్రమంలో భాగంగా రైతుచైతన్య యాత్రలు, రైతు సదస్సులు చేపట్టలేదు. దీనివల్ల రైతులు ఇంకా సాగుకు సన్నద్ధం కాలేదు. వర్షాలు వస్తే జూన్ 15 నుంచి వేరుశనగ విత్తు ప్రారంభమవుతుంది.  
 
 జిల్లాకు 3.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగతో పాటు కొద్ది మోతాదులో కందులు, మొక్కజొన్న, ఆముదం విత్తనాలను పంపిణీ చేయడానికి అనుమతులు లభించాయి. రైతులు పూర్తి ధర పెట్టి కొనుగోలు చేస్తే తరువాత సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ధరలు, సబ్సిడీ ఖరారు కావడంతో విత్తన పంపిణీ ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు. జూన్ మొదటివారంలో పంపిణీ చేసే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 21,450 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. ఇందులో 90 శాతం ఇన్‌లైన్ డ్రిప్ పరికరాలు ఇవ్వాలని కోరారు.
 
 జిల్లాలో అధికారికంగా 1.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా 2.20 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తూ ఈ మేరకు డ్రిప్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 2003 నుంచి ఇప్పటివరకు డ్రిప్ యూనిట్లు 1.06 లక్షల హెక్టార్లకు, స్ప్రింక్లర్లు 64 వేల హెక్టార్లకు అందజేశారు. గత ఏడాది నుంచి స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణీ ఆపేశారు. డ్రిప్ మాత్రమే ఇస్తున్నారు. ఒకసారి డ్రిప్ తీసుకున్న రైతులకు పదేళ్ల తరువాత రెండో సారి ఇవ్వవచ్చన్న నిబంధన ఉంది. దీంతో 2003లో తీసుకున్న 1,120 మంది రైతులు కూడా ప్రస్తుతం అర్హులు. ఈ నేపథ్యంలో డ్రిప్ కేటాయింపులు పెంచాలని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. గత మూడు, నాలుగేళ్లుగా కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి.
 
 డిమాండ్ మాత్రం అధికంగా ఉంది. సుమారు నాలుగు వేల మంది రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డ్రిప్ కోసం వేచిచూస్తున్నారు. కాగా..  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.36 కోట్లతో పథకాలు కేటాయించాలని ఉద్యానశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏడీ-1 నుంచి రూ.18.85 కోట్లకు, ఏడీ-2 నుంచి రూ.17.15కోట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. కొత్త తోటలు, పూలతోటల విస్తరణ, పాతతోటల పునరుద్ధరణ, మల్చింగ్ రాయితీ, వర్మీకంపోస్టు యూనిట్లు, యాంత్రీకరణ, ఫారంపాండ్స్, పాలీహౌస్, షేడ్‌నెట్స్, గ్రీన్‌హౌస్‌లు, కూరగాయల విత్తనాలు,  టిష్యూకల్చర్ అరటి ప్రయోగశాల పటిష్టత తదితర వాటి కోసం బడ్జెట్ కేటాయించాలని నివేదించారు. ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఖ్యాతిని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం అరకొర కేటాయింపులు దక్కుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా కేటాయింపులు పెంచి..రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చాల్సిన అవసరముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement