రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి

రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి - Sakshi


ప్రధానికి చంద్రబాబు వినతి

 

న్యూఢిల్లీ: ఒకవైపు ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అని, దానిని ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరోవైపు తెర వెనుక హోదా ఇవ్వకపోయినా సరే.. ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీ వద్ద మోకరిళ్లడం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమేరకు ఒక చిట్టాపద్దుల జాబితాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం నాటి సమావేశంలోనే ఇచ్చినట్టు బుధవారం వార్తలు హల్‌చల్ చేశాయి. తాను ఎలాంటి కోరికల చిట్టా ప్రధానమంత్రికి ఇవ్వలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నార్త్ బ్లాక్‌లో అరుణ్‌జైట్లీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజే ఈ వార్తలు వె లుగు చూడడం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆయా గణాంకాలపై ముందే కేంద్ర రెవెన్యూ, వ్యయ విభాగం కార్యదర్శితో గత వారమే కసరత్తు చే సినా.. దానిలో మరికొన్ని అంశాలు కలుపుతూ చంద్రబాబు ఈ నివేదికను మంగళవారం ప్రధానికి సమర్పించినట్టు సమాచారం.అయితే, ఈ వార్తలను అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. బిహార్‌కు ఇది వరకు అమలులో ఉన్న పథకాలనే ప్యాకేజీగా మార్చి కేంద్రం ఇవ్వడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు గుదిగుచ్చిన ఈ ప్రత్యేక ప్యాకేజీలోనూ చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, ఇదివరకే అమలులో ఉన్న పథకాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రూ.90వేల కోట్లు ఇవ్వాలని, వీటికి అదనంగా మెట్రో రైలుకు ఇంత, విద్యుద్దీకరణకు ఇంత అంటూ వివిధ కేటగిరీలు రాసినా.. అవన్నీ వివిధ రూపాల్లో అమలులో ఉన్నవి, వివిధ రూపాల్లో చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవే కావడం గమనార్హం. రెండింటితో పోల్చుతూ..

 ఇటీవల బిహార్‌కు ఇచ్చిన ప్యాకేజీ రూ.1,25,003కోట్లకు అదనంగా దాదాపు రూ.లక్ష కోట్లను జోడిస్తూ గణాంకాలు తయారు చేశారు. బిహార్‌కు మొత్తం 12 కేటగిరీల కింద రూ.1,25,003 కోట్ల ప్యాకేజీ ఇవ్వగా.. ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు ఇదే రీతిలో 13 అంశాలతో ప్యాకేజీ అడిగారు. ఆంధ్రప్రదేశ్ సస్టేయినేబుల్ డెవలప్‌మెంట్ 2015-2020కి ప్రతిపాదనలు అనే శీర్షికతో కూడిన ఈ డాక్యుమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు ఒక భాగంలో, ఆంధ్రప్రదేశ్, బిహార్ ప్యాకేజీలను పోల్చుతూ ఒక భాగంలో, బిహార్ ప్యాకేజీ వివరాలు ఒక భాగంలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనల్లో భాగంగా మొత్తం 13 అంశాల  కింద రూ.2,25,486 కోట్లు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన హామీలు నెరవేర్చడం కోసం రూ.90,910కోట్లు ఇవ్వాలని కోరారు. వీటిలో ప్రధానంగా 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూలోటు రూ.12,110కోట్లు, వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ కింద రూ.7వేల కోట్లు తదితర అంశాలు ఉన్నాయి.హా రహదారులు పద్దు కింద మొత్తం రూ.27,985 కోట్లు హా రైల్వే పద్దు కింద మొత్తం రూ.21,420 కోట్లు హా విమానయానం కింద రూ.3,100 కోట్లు హా నౌకాశ్రయాలకు రూ.4,800 కోట్లు హా విద్యుత్తు రంగానికి రూ.3,190 కోట్లు హా నీటిపారుదల, వ్యవసాయానికి రూ.24,627 కోట్లు హాగ్రామీణ నీటి సరఫరాకు రూ.13,174 కోట్లు హా పట్టణ సర్వీసులకు రూ.14,106 కోట్లు హా అడవులకు రూ.1,950 కోట్లు హా పర్యాటకం రూ.4,750 కోట్లు హా ఆరోగ్యం రూ.5,484 కోట్లు హా సామాజిక సాధికారతకు రూ.9,450 కోట్లు హా ఇలా మొత్తం కలిపి రూ.2,25,486 కోట్లు ఇవ్వాలని బాబు ప్రధానికి విన్నవించినట్లు తెలిసింది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top