కులాంతర వివాహం చేసుకుందని..

Girl's family threatening to file case if we do inter caste marriage  - Sakshi

కోర్టు ఆవరణ నుంచే ఈడ్చుకెళ్లారు 

బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు 

నెల్లూరు జిల్లా /గూడూరు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఆమె తల్లిదండ్రులు కోర్టు ఆవరణ నుంచే బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డొచ్చిన ఆమె భర్త బంధువులను కొట్టారు. ఈ ఘటన పట్టణంలో శనివారం సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. చిల్ల కూరు మండలం వల్లిపేడుకు చెందిన నిండలి రఘురామయ్య, సంపూర్ణమ్మ  కుమారుడు రాధాకృష్ణ నెల్లూరులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉన్న ఎస్‌కే మీరామోహిద్దీన్‌ కుమార్తె అస్మాతో రాధాకృష్ణకు పరిచమై, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 

రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో, రెండు నెలల క్రితం ఎదురించి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. దీంతో అస్మా తల్లిదండ్రులు నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తెను రాధాకృష్ణ కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ జంటను పిలిపించగా, వారిద్దరూ మేజర్లమని, తమ ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో.. చేసేది లేక పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేశారు.   పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామని, భవిష్యత్‌లో తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రమాదముందని కోర్టును ఆశ్రయించారు. 

ఈ మేరకు ఇరు కుటుంబాల వారికి, నోటీసులు వెళ్లగా ఇరువురి పెద్దలతో పాటు, దంపతులు శనివారం వాయిదాకు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అస్మా తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు ఇదే అదనుగా ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణతో పాటు అతని తండ్రి, వారి బంధువులు కూడా అడ్డుకునే యత్నం చేయడంతో వారిని కొట్టి అస్మాను కారులో తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు రాధాకృష్ణ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top