ఈ చిన్నారికి ఎంత కష్టం 

Girl Was Effecting With The Elusive Disease In Kurnool - Sakshi

ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన వయసులో ఆ చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. చేతులు, కాళ్లకు వాపు రావడంతో నడవలేకపోతోంది. ఇంటి వద్ద మంచానికే పరిమితమైంది.ఆడుకోవడానికి శరీరం సహకరించకపోవడంతో తల్లడిల్లిపోతోంది. తాను కూడా బడికి పోతానని, ఆడుకుంటానని.. ఆ చిన్నారి మారాం చేస్తుంటే తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు. చిన్న వయస్సులోనే సోకిన పెద్ద జబ్బును చెప్పలేక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. 

సాక్షి, కోడుమూరు(కర్నూలు) :  కల్లపరి గ్రామానికి చెందిన జంగం చంద్రయ్య, లలితమ్మ దంపతులకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. ప్రతి రోజూ కూలికెళితేగాని పూటగడవని పరిస్థితి వారిది. వారి కుమార్తె జయలక్ష్మి ఎంతో చురుకుగా ఉండేది. ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఆటలాడుకుంటుంటే తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఐదేళ్ల వయస్సులో కల్లపరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రెండేళ్ల పాటు ఎంతో చక్కగా జయలక్ష్మి చదువుకుంది.

అయితే గత ఏడాది మార్చి నెలలో చిన్నారికి ఉన్నట్టుండి ముఖం, కాళ్లు, చేతులు, గొంతు మొత్తం వాపు రావడం ప్రారంభించాయి. భయపడిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపుత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కిడ్నీ వ్యాధని డాక్టర్లు చెప్పడంతో  రూ.3లక్షలకు పైగా అప్పులు చేసి బళ్లారి, రాయచూరు తదితర  ప్రాంతాల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు.  మాత్రల కోసం నెలనెలా రూ.5వేలకు పైగా ఖర్చు వస్తోంది. కూలినాలి చేసిన డబ్బులన్నీ పాప వైద్యానికి ఖర్చు చేస్తున్నారు.

రోగం నయం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఎవ్వరైనా సాయం చేయదలచిన వారు జంగం లలిత, కెనరా బ్యాంకు, అకౌంట్‌ నెం : 1679101011237లో డిపాజిట్‌ చేయాలని వేడుకుంటున్నారు. వివరాలకు సెల్‌ నెం : 9502127063 సంప్రదించాలని కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top