కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలివ్వాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ అన్నారు.
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలివ్వాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో యూటీఎఫ్(ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్)ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు.
ఈ విషయమై మంత్రి జానారెడ్డి కూడా తన అంగీకారాన్ని తెలిపారని ఆయన చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్య విషయంలో అగ్రరాజ్యమైన అమెరికా ముందు మనం దిగదుడుపేనని ఆయన అన్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మన కార్పోరేట్ విద్యాసంస్థల్లో కన్నా మెరుగ్గా ఉంటుందని ఆయన అన్నారు. అమెరికాలో నాలుగైదు తరగతుల విద్యార్థులకే ల్యాప్‌టాప్‌లుంటాయని, మన వద్ద పీజీ విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లుండవన్నారు. అమెరికాలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులిరువురూ ఉన్నతోద్యోగులో, డాక్టర్లో అయి ఉండాలని ఆయన అన్నారు. మన దేశంలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామని నాగేశ్వర్ అన్నారు. 2024 వరకు మన దేశంలో శ్రమశక్తి 34 శాతం పెరుగుతుందని, అదే చైనా, అమెరికా దేశాల్లో ఉన్నదాంట్లోనే నాలుగైదు శాతం చొప్పున తగ్గిపోతోందని ఆయన అన్నారు.
వనరుల వినియోగం విషయంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయులు కొందరు ఉద్యోగం రాగానే పై చదువులకు స్వస్తి చెబుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. ఉద్యోగం వచ్చినా పై చదువులు చదువుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధనకు జరిగే పోరాటంలో తాను ముందుంటానని ఆయన హామీనిచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా ఏం జరగదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. సదస్సులో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. మాణిక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. ఆంజనేయులు, కోశాధికారి గాలయ్య పాల్గొన్నారు.