తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా ఆంగ్లవిద్య అందిస్తామని ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా ఆంగ్లవిద్య అందిస్తామని ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట మండలంలోని మాచాపూర్, చింతమడక గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందని, ఇక సీమాంధ్రుల ఆటలు తెలంగాణలో చెల్లవన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయని రైతులు అరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామాల్లో వ్యవసాయానికి 3గంటలు కూడా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం లేదని ఆయన ఎదుట అవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలపై అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. చింతమడకలో రూ.1.20కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దశలవారీగా గ్రామాల అబివృద్ధికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో రూ.3లక్షలతో యాదవ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ.32లతో మోడల్ పాఠశాల భవననిర్మాణానికి ప్రారంభోత్సవం చేస్తున్నట్లు తెలిపారు.
చింతమడకలో మొదటి, రెండవ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన, ఎస్సీ శ్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన, బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మంచినీటి క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణవేణి, లక్ష్మి, సిద్దిపేట పీఎసీఎస్ డెరైక్టర్ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బాలకిషన్‌రావు, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.