చిట్స్‌ పేరుతో మోసం | fraud in the name of Cits in tirupathi | Sakshi
Sakshi News home page

చిట్స్‌ పేరుతో మోసం

Mar 25 2017 11:12 AM | Updated on Aug 21 2018 5:51 PM

చిట్‌ఫండ్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన తిరుపతి నగరంలో రాత్రి వెలుగులోకి వచ్చింది.

► లబోదిబోమంటున్నబాధితులు
► సంఘమిత్ర ఎంటర్‌ప్రైజెస్‌పై కేసు నమోదు
 
తిరుపతి: చిట్‌ఫండ్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన తిరుపతి నగరంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈస్ట్‌ సీఐ రాంకిశోర్, బాధితురాలు సావిత్రి కథనం మేరకు.. నగరంలోని ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని పాస్‌పోర్టు ఆఫీస్‌ సమీపంలో ఉన్న సంఘమిత్ర ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో చిట్‌ఫండ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్‌జీవోస్‌ కాలనీలో నివాసముంటున్న సుబ్రమణ్యం భార్య సావిత్రి, మరో ఐదుగురు స్నేహితులు 2015 నవంబర్‌లో రూ.10 లక్షల చిట్లు వేశారు.

కొద్దినెలల పాటు సజావుగానే సాగింది. 10 నెలలు కట్టించుకుని అనంతరం చిట్‌లు ఎత్తేస్తున్నామని కంపెనీ డైరెక్టర్లు ఆమెకు సూచించారు. ఇంతవరకు కట్టిన డబ్బుతో పాటు కమిషన్‌ కూడా ఇస్తామన్నారు. దీంతో అంగీకరించిన సావిత్రి 2 నెలల అనంతరం తిరిగి తమకు రావాలల్సిన డబ్బులను అడిగారు. ఆ సంస్థలో 8 మంది డైరెక్టర్లు ఉండడంతో ఒకరిపై ఒకరు చెప్పుకుని తిప్పించుకుంటూనే ఉన్నారు. మోసం చేశారని తెలుసుకున్న ఆమె గురువారం ఈస్ట్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత దామోదరం, గోపి, భూపతి, మరో ఐదుగురు కలసి తనను మోసం చేశారంటూ పోలీసులకు తెలిపింది.

సీఐ రాంకిశోర్‌ తన సిబ్బందితో గురువారం రాత్రి సంఘమిత్ర కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ రిజిస్టర్‌ అయినట్లుగానీ, కంపెనీకి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్లు దొరకలేదు. అనుమతి లేకుండానే చిట్లు నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో దామోదరంతో పాటు మరో డైరెక్టర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేవిధంగా ఇంకా ఎంతోమంది బాధితులు ఉన్నారని వీళ్లు బయటకు పొక్కకుండా తరచూ వారిని ప్రలోభపెడుతూ రోజులు గడుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement