పిడుగురాళ్లలో భూకంపం

Four times Earthquake in Piduguralla - Sakshi

నాలుగుసార్లు కంపించిన భూమి 

ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు

ఉలిక్కిపడిన అధికారులు 

పిడుగురాళ్ల (గురజాల): గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం భూమి కంపించింది. ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. గంటన్నర వ్యవధిలో మొత్తం నాలుగుసార్లు శబ్దం రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి, 3.45 గంటలకు రెండోసారి, 4.30 గంటలకు మూడోసారి, 4.58 గంటలకు నాలుగోసారి భూమి కంపించింది. పిడుగురాళ్ల చుట్టూ సున్నపురాళ్ల క్వారీలు ఉండటంతో క్వారీల్లో బ్లాస్టింగ్‌ జరిగినపుడు పెద్ద శబ్దాలు వస్తుంటాయి. అయితే అవి క్వారీకి సమీపంలో ఉన్న వారికి మాత్రమే వినిపిస్తాయి. కానీ పట్టణంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ముఖ్యంగా పిల్లలగడ్డ, పాటిగుంతల, రైల్వేస్టేషన్‌ రోడ్డు, శ్రీనివాసకాలనీ, తహసీల్దార్‌ కార్యాలయం వెనుక వైపు, పోలీస్‌స్టేషన్‌ సెంటర్, జానపాడు రోడ్డుతో పాటు ఆక్స్‌ఫర్డ్‌లోని అపార్ట్‌మెంట్స్, చెరువుకట్ట బజారు, ఐలాండ్‌ సెంటర్‌తో పాటు ప్రధాన రహదారుల్లో ఉన్న ఇళ్లల్లో కూడా ఒక్కసారిగా శబ్దాలు రావడంతో భూకంపం వచ్చిందంటూ ప్రజలు పరుగులు తీశారు. అధికారులు సైతం ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాక సతమతమయ్యారు. తహసీల్దార్‌ కె.రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ కాసు శివరామిరెడ్డి, సీఐ వీరేంద్రబాబు, రూరల్‌ సీఐ ఎంవీ సుబ్బారావు భూకంపం వచ్చిన పలు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అడ్డగోలుగా క్వారీలు తవ్వడం వలనే..
అడ్డగోలుగా భూగర్భ ఖనిజాలు తీయడం వల్లే ఇటువంటి భూకంప విపత్తు సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పిడుగురాళ్ల చుట్టూ సున్నపు క్వారీల గనులు, తెల్లరాయి గనులున్నాయి. నిబంధనలు వదిలి ఎంతలోతు రాయి ఉంటే అంతలోతు తవ్వకాలు చేస్తున్నారు. రాళ్లు తీసేటపుడు కూడా మోతాదుకు మించి పేలుడు పదార్థాలు వాడుతున్నారు. అధికార యంత్రాంగం క్వారీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయని ప్రజలు చెబుతున్నారు.

పెద్ద శబ్దం రావడంతో భయమేసింది
మధ్యాహ్నం ఇంటికి వచ్చాను. తినేందుకు ప్లేటులో అన్నం పెట్టుకున్నాను. ఒక్కసారిగా ఢాం అని శబ్దం రావడంతో భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే సమయంలో మరోసారి శబ్దం రావడంతో మరింత భయమేసింది.
– మద్దిగుంట సైదులు, పిడుగురాళ్ల

కాళ్లు, చేతులు వణికిపోయాయి
వరుసగా భూకంప శబ్దాలు రావడంతో కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఇంట్లో ఉండాలంటే భయమేసింది. శబ్దం విని బయటకు పరుగులు తీసి అరుగు మీద కూర్చున్నాను. మా బజారులో వారంతా బయటకు వచ్చి ఏమిటీ శబ్దాలంటూ ఆందోళన చెందారు.
– విజయలక్ష్మి, పిడుగురాళ్ల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top