వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి | Four people died in different hazards | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

May 31 2017 6:33 AM | Updated on Aug 30 2018 4:10 PM

జాతీయ రహదారిపై టెక్కలిలోని అయోధ్యపురం కూడలి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును వెనుకనుంచి ప్రమాదవశాత్తు

టెక్కలి రూరల్‌: జాతీయ రహదారిపై టెక్కలిలోని అయోధ్యపురం కూడలి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును వెనుకనుంచి ప్రమాదవశాత్తు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మందస మండలం మద్దూరు గ్రామానికి చెందిన బిల్లంగి శేఖరరావు(60) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై మందస నుంచి టెక్కలి వైపు వస్తుండగా అయోధ్యపురం కూడలి సమీపంలో ఆగివున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు.      ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేఖరరావును టెక్కలి ఎస్‌ఐ రాజేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బుడితి సీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ దుర్మరణం
జలుమూరు:  జలుమూరు వంశధార కాలువ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడితి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ పోలాకి గణపతిరావు(59) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.... టెక్కలి నుంచి బుడితి సీహెచ్‌సీకి డ్యూటీకి తన మోపెడ్‌పై గణపతిరావు వెళుతుండగా వెనుకనుంచి వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయమైంది. తారు రోడ్డు అంచుకు తల గట్టిగా తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం అక్కడకు చేరుకొని సిబ్బంది ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.    తలకు హెల్మెంట్‌ ఉంటే మృతి చెందేవాడు కాదని పోలీసులు చెబుతున్నారు. కాగా గణపతిరావుకు భార్య శ్రీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  కోటబొమ్మాళి తరలించారు.

జంగాలపాడు వద్ద...
మెళియాపుట్టి: గంగరాజపురం గ్రామానికి సరిహద్దు ఒడిశాలోని జంగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన బుసికిడి గ్రామస్తుడు బి.రామరాజు(17) మృతి చెందాడు. బుసికిడిలో పండుగ ముగింపు సందర్భంగా సరిహద్దు గ్రామమైన పెద్దలక్ష్మీపురం(ఆంధ్రా)లో ఉంటున్న తన తాత సోనాపురం రోహిణి ఇంటికి భోజనం క్యారేజ్‌ను ద్విచక్రవాహనంపై తీసుకువస్తున్నాడు. ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాను ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై ప్రమాద సంఘటన వద్దే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement