మాజీ ఎమ్మెల్యే హల్‌చల్‌

The Former MLA Delinquent - Sakshi

 పెద్దింట్లమ్మ తిరునాళ్లలో భక్తుల మెప్పు పొందేందుకు తంటాలు

అటవీ మహిళా అధికారిని హెచ్చరించిన జయమంగళ

పందిరిపల్లిగూడెం రోడ్డు నిర్మాణంలో వివాదం 

అభయారణ్యంలో నిర్మాణం కుదరదన్న ఫారెస్టు అధికారులు

పందిరిపల్లిగూడెం (కైకలూరు): ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అటవీ శాఖ నిబంధనలకు కొల్లేరు గ్రామాల్లో తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరోసారి ‘చింతమనేని’ అవతారం ఎత్తారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఫోన్‌లో రేంజర్‌ను ఇష్టానుసారం తిట్టారు. కొల్లేరు నాయకులతో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. దీంతో కొల్లేరు పెద్దింట్లమ్మ దర్శనానికి వచ్చే యాత్రికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.

వివరాల్లోకి వెళితే పందిరిపల్లిగూడెం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు రోడ్డును ఆర్‌అండ్‌బీ అ«ధికారులు నిర్మించడానికి గ్రావెల్‌ తోలారు. బుధవారం కొల్లేరు పరిశీలనకు వచ్చిన అటవీ శాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్, రేంజర్‌ విజయ కొల్లేరు అభయారణ్య పరిధిలో అటవీ శాఖ అనుమతి లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని, పనులను అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం పనులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. 

జయమంగళ హల్‌చల్‌..

పెద్దింట్లమ్మ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్డును వేస్తుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఎంటీ? అని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెచ్చిపోయారు. పెద్దింట్లమ్మ దర్శనానికి పార్టీ నాయకులతో వచ్చిన ఆయన దారిలో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. ఫారెస్టు రేంజర్‌ విజయతో ఫోన్‌లో ఇష్టానుసారం మాట్లాడారు. ముందుగా రోడ్డు ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి  అనుమతులు తీసుకోవాలని చెప్పినా ఆమె మాట వినలేదు.

చివరకు రేంజర్‌.. జయమంగళకు ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దేవస్థానానికి చేరే భక్తులు గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. చివరకు సీఐ రవికుమార్‌ వచ్చి భక్తులకు దారి ఇవ్వాలని చెప్పారు. ఆర్‌అండ్‌బీ సిబ్బంది ఎట్టకేలకు రోడ్డు వేయడానికి దించిన మెటీరియల్‌ను వెనక్కు తీసుకువెళ్ళారు. 

అనుమతులు తీసుకోవాలి..

కొల్లేరు అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులను అడ్డగోలుగా తవ్వితే పట్టించుకోని అటవీ శాఖ అధికారులు భక్తులకు అవసరమైన రోడ్డు నిర్మాణంలో ఆంక్షలు విధించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అయితే, అటవీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం ముందుగా తమకు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. పందిరిపల్లిగూడెం రోడ్డు పక్కా అభయారణ్యంలో ఉందని స్పష్టం చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top