రామవరప్పాడు ఫ్లై ఓవర్ పూర్తిచేయండి | flyover complete the construction this year | Sakshi
Sakshi News home page

రామవరప్పాడు ఫ్లై ఓవర్ పూర్తిచేయండి

May 22 2015 3:13 AM | Updated on Sep 3 2017 2:27 AM

ఇన్నర్ రింగురోడ్డులో భాగంగా రామవరప్పాడు వైపు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని...

- ఈ ఏడాదిలోనే అన్ని పనులు అయిపోవాలి
- ‘ఇన్నర్' కాంట్రాక్టర్లకు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశం
- సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తానని హామీ


సాక్షి, విజయవాడ బ్యూరో : ఇన్నర్ రింగురోడ్డులో భాగంగా రామవరప్పాడు వైపు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇంకా ఆలస్యమైతే సహించేది లేదని, చర్య తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణ పనులను ఆయన పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి సమీక్షించారు. ఫ్లైవోవర్ నిర్మాణం చేపట్టిన ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిపించి పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. రింగురోడ్డులో నున్న వైపు ఉన్న భాగం పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. రామవరప్పాడు వైపు పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని, ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. భూసేకరణ సమస్యతోపాటు ఫ్లైవోవర్ పనులు చేపట్టడానికి సరైన అప్రోచ్ రోడ్లు లేవని, అడ్డదిడ్డంగా భవనాలుండటం వల్ల ఇబ్బందులున్నాయని వారు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్న కమిషనర్ వాటి గురించి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌తో చర్చించారు.

 

అనంతరం నెలరోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు ఎప్పటికి పూర్తవుతాయి, ఏవిధంగా చేస్తారు, దానికి ప్రణాళిక ఏమిటనే దానిపై షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది జనవరికి పనులు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో అందుకు కమిషనర్ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే పనులు పూర్తి చేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకుని షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించారు. శనివారానికి షెడ్యూల్ ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణ పనులను సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఆర్‌డీఏ యుటిలిటీస్ డెరైక్టర్ కాశీవిశ్వేశ్వరరావు, అధికారులు మోహనరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement