ఏ పూలు తేవాలి నీ పూజకు!

Flowers Shortage in Srikalahasti Temple - Sakshi

ముక్కంటీశునికి పుష్పాలు కరువు

అరకొర సుమాలలే దిక్కు

వేళకు సరఫరా చేయని కాంట్రాక్టరు

ఆలస్యమవుతున్న పూజలు, కైంకర్యాలు

పట్టనట్టు వ్యవహరిస్తున్న దేవస్థానం

విభూధీశుడికి విరులు కరువయ్యాయి. అరకొర పుష్పాలు, మాలలే దిక్కయ్యాయి. ఏడాదిగా నిత్యకైంకర్యాలు ఆలస్యమవుతున్నాయి. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తనకు వీలున్నప్పుడే కొన్ని పూలను సరఫరాచేసి చేతులు దులుపుకుంటున్నారు. అవికూడా నాసిరకంగా ఉంటున్నాయి. ఆలయానికి చేరేలోపే వాడిపోయి కళావిహీనంగా మారుతున్నాయి. వీటినే స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తున్నారు. నిత్యకైంకర్యాలు అతికష్టంమీద నెట్టుకొస్తున్నారు. ముక్కంటీశునికి ఎదురవుతున్న పూల కష్టాలపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..

సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి: శైవక్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం 20వేల నుంచి 30 వేల మంది భక్తుల వరకు స్వామి, అమ్మవార్లతో పాటు అనుబంధ ఆలయాల్లోను పూజలు చేసుకుంటుంటారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలు మరో 17 ఉన్నాయి. ప్రధాన ఆలయంలోని పరివార దేవతలతో పాటు అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు నిత్యం వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నాలుగు కాలాల్లో అభిషేకానంతర పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం 5 గం, 6గం, 9గం, సాయంత్రం ఓసారి స్వామి అమ్మవార్లకు అభిషేకానంతర పూజలు చేస్తారు.

టెండరుకు పోటీ.. పూజలకు టోపీ
ప్రధాన ముక్కంటి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలు సరఫరా చేసేందుకు ప్రతి ఏటా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం టెండర్లు పిలుస్తుంది. అందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టెండర్‌ని టీడీపీ నాయకుడు శ్రీకాళహస్తీశ్వర ట్రస్టుబోర్డు సభ్యుడు సిద్దులయ్య తన భార్య పేరున దక్కించుకున్నారు. ఈ టెండర్‌ని కూడా ఇతరులకు ఎవరికీ దక్కకుండా పోటీపడి దక్కించుకున్నారు. టెండరు దక్కించుకునేందుకు పోటీపడ్డ కాంట్రాక్టరు స్వామి, అమ్మవార్లకు పూల మాలలు సరఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అర్చకులు, ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతలు ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా మరో 17 ఆలయాలు ఉన్నాయి. స్వామి, అమ్మవార్లకు రోజుకు 8 మాలలు, పరివార దేవతలకు 20 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు మరో 47 పూల మాలలను సరఫరా చేయాల్సి ఉంది. టెండరు దక్కించుకున్నాక ధరలతో నిమిత్తం లేకుండా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలను సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌ది.

అరకొర సరఫరా.. వేళకు రాని పూలు
పుష్పమాలలు సరఫరా చేస్తానని టెండరు దక్కించుకున్న టీడీపీ నేత వేళకు అవసరమైనన్ని మాలలు సరఫరా చేయడం లేదు. స్వామి, అమ్మవార్లకు నాలుగు కాలాల్లో అభిషేకానంతరం పూజలు నిర్వహిస్తుండడంతో అరగంటకు ముందే పువ్వులు ఆలయానికి చేరవేయాలి. ప్రధాన ఆలయంలో మొత్తం 28 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాలకు మరో 47 పూలమాలు సరఫరా చేయాల్సి ఉంది. వేకుజామున 5 గంటలకు మొదటి కాల అభిషేక పూజ ప్రారంభిస్తుండడంతో అరగంట ముందే పూలమాలలు అందుబాటులో ఉండాలి. అయితే కాంట్రాక్టరు రకరకాల కారణాలతో ఒకరోజు 5.30 గంటలకు, మరో రోజు 6 గంటల సమయానికి పూల మాలలు సరఫరా చేస్తున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు. దీంతో స్వామి అమ్మవార్ల పూజ ఆలస్యం అవుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరఫరా చేస్తున్న పూల మాలలు కూడా ఒక్కోసారి తక్కువ ఇచ్చి పంపుతున్నట్లు తెలిసింది. వరదరాజస్వామి ఆలయానికి ఆరు మాలలు ఇవ్వాల్సి ఉంటే ఆదివారం కేవలం నాలుగు పూల మాలలు సరఫరా చేశారు. ముత్యాలమ్మగుడికి నాలుగు మాలలు ఇవ్వాల్సి ఉంటే కేవలం రెండే మాలలు ఇచ్చి వెళ్లినట్లు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా శ్రీకాళహస్తీశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలకు తరచూ ఇదే తరహాలో కాంట్రాక్టరు పూలమాలలు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాణ్యమైన పువ్వులకు మంగళం
గతంలో మంచి సువాసన వెదజల్లే వివిధ రకాల పువ్వులతో మాలలు తయారుచేసేవారు. టీడీపీ నేతలు టెండర్లు దక్కించుకుంది మొదలు నాణ్యమైన పువ్వులు కరవయ్యాయి. ప్రస్తుతం బంతి పూలతో పాటు కాగితాల పూలు, హైబ్రిడ్‌ పూలతో మాలలు తయారుచేస్తున్నారు. అందులోనూ రబ్బరు ఆకులు అధికంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. మాలకు మూడు భాగాల్లో ఎక్కువగా రబ్బరు ఆకులు అధికంగా పెట్టి మధ్యలో సాదాసీదా పూలతో మాలను తయారుచేసి ఇచ్చేస్తున్నారు. పోటీలు పడి టెండర్లు దక్కించుకుని స్వామి, అమ్మవార్లకు పూలమాలలు సరఫరా చేయకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు, అర్చకులు నోరుమెదపడం లేదని ప్రచారం జరుగుతోంది.

పూల మాలలు సరఫరా సరిగా లేదు
ఆలయానికి పూలు సరఫరా కాట్రాక్టర్‌ సరిగా పూలు అందిచడం లేదనేది నిజమే. అయితే ఈ విషమై పలుమార్లు కాట్రాక్టర్‌కు మెమోలు ఇచ్చాం. బిల్లులో కోత విధించాం. తక్కువకు కోట్‌ చెయ్యడం వల్లనే అతనికి పూల కాంట్రాక్టు దక్కింది. ఇదేవిధంగా పూలు సరఫరా చెయకుంటే కాట్రాక్టర్‌పై తప్పక  చర్యలు తీసుకుంటాం.– రామస్వామి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top