వామ్మో..స్వైన్‌ఫ్లూ | Five Swine Flu Cases Filed In Anantapur | Sakshi
Sakshi News home page

వామ్మో..స్వైన్‌ఫ్లూ

Nov 12 2018 1:09 PM | Updated on Nov 12 2018 1:09 PM

Five Swine Flu Cases Filed In Anantapur - Sakshi

అనంతపురం న్యూసిటీ: స్వైన్‌ఫ్లూ దెబ్బకు ‘అనంత’ వణికిపోతోంది. ఇప్పటికే జిల్లా ఐదు కేసులు నమోదు కాగా తాజాగా మరో గర్భిణికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. రొద్దంకు చెందిన ఓ గర్భిణిని(22) అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆదివారం ఆస్పత్రిలోని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌లో అడ్మిట్‌ చేశారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో...మైక్రోబయాలజీ విభాగం సిబ్బంది గర్భిణి త్రోట్‌ స్వాప్‌ తీసి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు రావాల్సి ఉంది. 

బెంగళూరుకు పరుగు తీస్తున్న బాధితులు
స్వైన్‌ప్లూతో బాధపడుతున్న రోగులు‘అనంత’ ఆస్పత్రిలో ఉండలేమంటూ పరుగులు తీస్తున్నారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ అమ్మాయిని కుటుంబీకులు ఆదివారం  సర్వజనాస్పత్రి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌ ఇక్కడే ఉంచితే...మెరుగైన వైద్యం అందిస్తామని బాధిత కుటుంబీకులకు భరోసా ఇచ్చినా వారు వినిపించుకోలేదు. ముఖ్యంగా స్వైన్‌ఫ్లూ వార్డులో సిబ్బంది ఎవరూ ఉండకపోవడం, ఒకరే ఉండాల్సి వస్తోందని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నట్లు తమ గ్రామస్తులకు తెలిస్తే మరోలా చూస్తారని చెబుతున్నారు. నార్పలకు చెందిన ఓ అమ్మాయిని ఇప్పటికే బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే.

నార్పల అమ్మాయికి స్వైన్‌ఫ్లూఎలా సోకిందంటే?
స్థానిక సాయినగర్‌లోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న ఓ 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థినికి స్వైట్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. నార్పలకు చెందిన ఈ అమ్మాయి సోదరుడు బెంగళూరులో స్టాఫ్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు. ఇటీవల ఇతనికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక..నార్పలకు వచ్చాడు. ఈ క్రమంలోనే సోదరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు ఆరోగ్యశాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ఆ చిన్నారికి స్వైన్‌ఫ్లూ లేదు
నార్పలకు చెందిన చిన్నారి(7)కి స్వైన్‌ఫ్లూ లేదని తేలడంతో ఆదివారం వైద్యులు బాలికను చిన్నపిల్లల వార్డుకు షిఫ్ట్‌ చేశారు. సాధారణ సమస్యగా పరిగణించి వైద్యం అందిస్తున్నారు.  

స్వైన్‌ఫ్లూ బాధితులు వీరే
జిల్లాలో నెలన్నర కాలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కళ్యాణదుర్గం బైపాస్‌లోని ఓ 40 ఏళ్ల మహిళకు స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనంతపురం నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి, ఓడీసీ మండలం కొండకమర్ల గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ, నార్పలకు చెందిన 26 ఏళ్ల గర్భిణి, అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న నార్పలకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి స్వైన్‌ఫ్లూ బాధితుల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement