స్థానిక ముచ్చుమిల్లి రోడ్డులోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అంటుకున్న బాణసంచా
మహిళ పరిస్థితి విషమం
రామచంద్రపురం :స్థానిక ముచ్చుమిల్లి రోడ్డులోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, ముచ్చుమిల్లి రోడ్డులో సాయిబాబా గుడివద్ద త్రిపురారి వెంకటేశ్వరరావు సొంత ఇంట్లో ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఆయన మరదలు వాణి టీ కాస్తూండగా.. గదిలో నిల్వ ఉంచిన బాణసంచాకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో స్థానికులు ఆందోళనతో రోడ్డుమీదకు వచ్చారు.
ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే గదిలో ఉన్న సామగ్రి కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న వాణి తీవ్రగాయాలపాలయ్యారు. ఆమెను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇంట్లో బాణసంచా పేలుతూండటం గమనార్హం. సంఘటన స్థలాన్ని సీఐ పి.కాశీ విశ్వనాథ్, ఎస్సై ఎల్.శ్రీనునాయక్ సందర్శించారు. అగ్నిమాపక అధికారి ఎన్.నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆర్డీవో కె.సుబ్బారావు, తహశీల్దార్ వి.సుబ్బారావు పరిస్థితిని సమీక్షించారు.