రసాయనాల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం | Fire accident in chemical factory | Sakshi
Sakshi News home page

రసాయనాల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Dec 14 2013 11:57 PM | Updated on Sep 5 2018 9:45 PM

మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మేడ్చల్/మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్: మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ. కోటికి పైగా ఆస్తి నష్టం జరిగింది. కంపెనీ యాజమాన్యం, మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఎస్కిటోన్స్ రసాయనాల కంపెనీలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని జీడిమెట్ల, సనత్‌నగర్, ప్యారాడైజ్  ప్రాంతాల నుంచి ఫైరింజన్లు వచ్చాయి.

అప్పటికే కంపెనీలో ఉన్న రసాయన పదార్ధాలు, తయారీకి వినియోగించే సాల్వెంట్ రియాక్టర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో రూ. కోటికి పైగా ఆస్తినష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కాగా రసాయనాలను కలిపే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, పరిశ్రమల శాఖా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ సీఐ రాంరెడ్డిలు చేరుకొని పరిస్థితిని సమీక్షిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement