టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ | fight between ycp, tdp leaders in ananthapur | Sakshi
Sakshi News home page

టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ

Apr 27 2015 6:48 PM | Updated on Oct 2 2018 6:46 PM

అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఎనుమలవారిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ఆదెప్ప, వైఎస్సార్‌సీపీ నాయకుడు నల్లచెరువు సర్పంచ్ రవికుమార్‌రెడ్డిల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది.

అనంతపురం : అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఎనుమలవారిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ఆదెప్ప, వైఎస్సార్‌సీపీ నాయకుడు నల్లచెరువు సర్పంచ్ రవికుమార్‌రెడ్డిల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. అదే సమయంలో గొడవ దృశ్యాలను కవర్ చేస్తున్న ఆ మండల సాక్షి విలేకరి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపె కూడా ఆ టీడీపీ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఫిర్యాదుల మేరకు వివరాలిలా ఉన్నాయి..మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆదెప్పకు నల్లచెరువు సర్పంచ్ ఎదురుపడ్డారు. తమ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు ఎందుకు సక్రమంగా పంపిణీ చేయడం లేదని సర్పంచ్‌ను ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఇరువురి మద్య పెద్ద ఘర్షణే జరిగింది. ఒకరిపై మరొకరు చెప్పులతో కూడా దాడి చేసుకున్నారు.

అదే సమయంలో ఎవరో ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఆ మండల సాక్షి విలేకరి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఆ విలేకరి అక్కడ గొడవ పడుతున్న సర్పంచ్ రవికుమార్‌రెడ్డికి సొంత సోదరుడు కావడంతో అతనిపై కూడా దాడి చేశారు. బండరాయితో తన గుండెల మీద కొట్టి దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యానంటూ ఆ విలేకరి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. తనపై దాడి చేసిన ఆదెప్పపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా ఆ టీడీపీ నేత ఆదెప్ప సైతం సర్పంచ్ రవికుమార్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు తనపై దాడి చేశారని మరో ఫిర్యాదు ఇచ్చాడు. ఇరు వర్గాలు ఇచ్చిన కేసులు నమోదు చేసుకొని విచారిస్తామని కదిరి డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement