పోలీసులకు ‘కరెంట్‌’ షాక్‌!

A Fight Between Police Department And Electricity Department About Sports Complex - Sakshi

సాక్షి, విజయవాడ : అత్త సొమ్ము అల్లుడు దానం.. అన్న సామెతగా ఓ ప్రభుత్వరంగ సంస్థ ఉన్నతాధికారి తనకు సంబంధం లేని స్థలాన్ని పోలీసు శాఖకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. గుణదలలో ఏపీఎస్పీడీసీఎల్‌ స్టోర్స్‌ యార్డు స్థలం విషయంలో కొద్ది రోజులుగా విద్యుత్, పోలీసు శాఖల మధ్య వివాదం నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గుణదల విద్యుత్‌ కార్యాలయంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఆధీనంలో ఉన్న 800 స్క్వేర్‌ యార్డ్స్‌ స్థలంలో పోలీసు శాఖ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ స్థలం తాము ఏపీ ట్రాన్స్‌కో నుంచి తీసుకున్నామని పోలీసు శాఖ చెపుతోంది. అయితే, ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు మాత్రం అది ట్రాన్స్‌కోకు సంబంధం లేని స్థలం అని చెబుతున్నారు. ఆ స్థలం పూర్తిగా తమదేనని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ స్థలంలో పోలీసు అధికారులు భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దాన్ని విద్యుత్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరిగి మాచవరం పోలీసులు ఆ స్థలంలో బోర్‌ వేసేందుకు వెళ్లారు. ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు అక్కడ బోర్‌ వేయటానికి వీలులేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసు శాఖ సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. గతంలో ట్రాన్స్‌కో సీఎండీగా పని చేసిన విజయానంద్‌ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ నిర్మించుకునేందుకు 800 స్క్వేర్‌ యార్డ్స్‌ స్థలాన్ని పోలీసు శాఖకు దారాదత్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆ స్థలం ట్రాన్స్‌కోకు సంబంధం లేదని ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు ఇప్పుడుచెబుతున్నారు.

ట్రాన్స్‌కోకు సంబంధం లేదు: విద్యుత్‌ శాఖ
గుణదలలో గత 40 ఏళ్ల నుంచి ఏపీఎస్సీడీసీఎల్‌ ఆధీనంలో స్టోర్స్‌గా ఉపయోగిస్తున్నామని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లు, పురాతనమైన మెటీరియల్స్‌తో స్టోర్స్‌ యార్డుగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్‌ సబ్‌ సేషన్లకు సంబంధించి వందలు, వేల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మీటర్లు, ఇతర సామాన్లకు యార్డుగా వినియోగిస్తున్న తమ స్థలం పోలీసులకు ఇచ్చేది లేదని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎన్‌. వెంకటేశ్వర్లు అంటున్నారు. ఈ విషయమై తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top