ఎరువుల దుకాణాలపై దాడులు | Fertilizer stores attacks | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాలపై దాడులు

Jan 4 2015 2:09 AM | Updated on Oct 1 2018 6:45 PM

ఎరువుల దుకాణాలపై దాడులు - Sakshi

ఎరువుల దుకాణాలపై దాడులు

పట్టణంలోని మూడు ఎరువుల దుకాణాలపై రెవెన్యూ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు.

6 ఏ కేసు నమోదు

ఆత్మకూరురూరల్: పట్టణంలోని మూడు ఎరువుల దుకాణాలపై రెవెన్యూ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు. ఆర్డీవో వెంకటరమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ బీకే వెంకటేశులు, వ్యవసాయశాఖ ఏడీ గోపినాయక్ తదితరులు మూడు బృందాలుగా ఏర్పడి షాపులు తనిఖీ చేశారు. కొన్ని దుకాణాల్లో రికార్డులు కంటే అధికంగా ఎరువులు ఉండగా, మరికొన్ని చోట్ల బిల్లులు లేకుండా విక్రయించడాన్ని గుర్తించారు.

దాడులు అనంతరం ఆర్డీవో వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ వ్యాపారులు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్‌లోని పలు దుకాణాలపై దాడులు చేశామన్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు.

మూడు దుకాణాల్లో ఎక్కువ ఉన్న 396 బస్తాల ఎరువులను సీజ్ చేసి 6 ఏ కేసు నమోదు చేశారు.  577 బస్తాలను విక్రయించినా వాటికి సంబంధించిన బిల్లులు లేవని తేల్చారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా బిల్లులు పొందాలని ఆర్డీవో సూచించారు. ఆత్మకూరు, అనంతసాగరం ఏవోలు ఎ.వాసు, కిశోర్‌బాబు, ఆర్‌ఐలు భాగ్యలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

 ఉదయగిరిలో దాడులు
 ఉదయగిరి : పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని శనివారం కావలి ఆర్డీవో ఎన్. వెంకటరమణ తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా గోదాము, దుకాణంలోని ఎరువులు, పురుగుమందుల నిల్వలు లెక్కించి స్వల్ప తేడాలున్నట్లు గుర్తించారు. తహశీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి ఐ.సుబ్రహ్మణ్యం రెండుసార్లు గోదాములో ఉన్న ఎరువుల బస్తాలను పరిశీలించారు.

యూరియా 11 బస్తాలు, 20:20:0:13  11 కట్టలు తేడా ఉన్నందున 6 ఏ కేసు నమోదు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అనేక ఎరువుల దుకాణాలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క దాన్లోనే తనిఖీలు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.         

Advertisement
 
Advertisement
Advertisement