తీపి తగ్గిన చెరుకు | Farmers Loss With Sugar Cane Crops | Sakshi
Sakshi News home page

తీపి తగ్గిన చెరుకు

Jan 25 2019 8:57 AM | Updated on Jan 25 2019 8:57 AM

Farmers Loss With Sugar Cane Crops - Sakshi

అమ్మకానికి సిద్ధంగా ఉన్న బెల్లం దిమ్మలు

విజయనగరం, శృంగవరపుకోట : చెరుకు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అమ్ముదామంటే అడవి...కొందామంటే కొరివి అన్నట్టుంది. రైతన్నకు ఆర్థికభరోసా ఇచ్చే చెరకు పంటలో లాభాల తీపి తగ్గుతోంది. కనీస మద్దతు ధర రాకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 వేల హెక్టార్లలో చెరుకు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లలో చెరుకును బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. ప్రధానంగా విజయనగరం డివిజన్‌లో శృంగవరపుకోట, జామి, గజపతినగరం మండలాల్లో.. పార్వతీపురం డివిజన్‌లో బొబ్బిలి, సీతానగరం, రామభద్రపురం, తెర్లాం, సాలూరు, పాచిçపెంట మండలాల్లో చెరుకు పంట సాగవుతోంది.

బెల్లం క్రషర్లపై ఆసక్తి ..
 భీమసింగి చక్కెర కర్మాగార పరిధిలోని 14 మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో.. బొబ్బిలి మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార పరిధిలోని 14 మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో  చెరుకు సాగు చేస్తున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో ఎస్‌.కోటలో 578 హెక్టార్లలో.. వేపాడ–160, జామి–76, లక్కవరపుకోటలో 14 హెక్టార్లలో చెరుకు సాగు చేస్తున్నారు.  ఈ పంటలో 20 శాతం బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. ఎన్‌సీఎస్‌ చక్కెర కార్మగార పరిధిలో బాడంగి, బొబ్బిలి, తెర్లాం మండలాల్లో ఏడాది పొడవునా వాడే కాటు బెల్లం, నాటుసారాకు వాడే నల్లబెల్లం తయారీ విరివిగా ఉంటుంది. బొబ్బిలి నుంచి బెల్లం రాయపూర్, ఒడిశా, కోల్‌కతా ప్రాంతాలకు రవాణా కాగా... ఎస్‌.కోట, జామి, గజపతినగరం ప్రాంతాల నుంచి బెల్లం నేరుగా అనకాపల్లి, విజయనగరం మార్కెట్లకు తరలిస్తారు. ప్రభుత్వం, కర్మాగార యాజమాన్యాలు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోవడంతో రైతులు చక్కెర కర్మాగారాలకు పంట ఇవ్వకుండా బెల్లం క్రషర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. క్రషర్లకు చెరుకు తీసుకెళ్తే రవాణా ఖర్చులు మిగులుతాయి.. అలాగే రోజల తరబడి నిరీక్షించే యాతన తప్పుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే సొమ్ము వెంటనే చేతికి వస్తుందన్న ధీమాతో క్రషర్లను ఆశ్రయిస్తున్నారు.

కలిసి రావడం లేదు..
చక్కెర కర్మాగారాలు గతేడాది రికవరీ ఆ«ధారంగా మద్దతు ధర నిర్ణయిస్తాయి. గతేడాది రికవరీ శాతం 9గా ఉండడంతో ఈ ఏడాది ఎన్‌సీఎస్‌ కర్మాగారం టన్నుకు మద్దతు ధరగా రూ. 2750...భీమసింగి కో ఆపరేటివ్‌ చక్మెర కర్మాగారం ప్రతినిధులు 2625 రూపాయలుగా నిర్ణయించారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడం.. దిగుబడి అప్పగించేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం.. ఈ సమయంలో చెరుకు బరువు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల చాలామంది రైతులు చెరుకు సాగు పట్ల విముఖత కనబరుస్తున్నారు. మరికొంతమంది రైతులు బెల్లం క్రషర్లవైపు మొగ్గు చూపుతున్నారు.

తగ్గిన బెల్లం ధరలు..
 ఈ ఏడాది ప్రారంభంలో తెల్లబెల్లం 10 కిలోలు 330 రూపాయల ధర పలికింది. క్రమంగా నెల రోజులుగా తగ్గుతూ ప్రస్తుతం రూ.290కి చేరింది. నల్లబెల్లం పది కిలోల ధర తొలుత రూ.290 కాగా పస్తుతం 250 రూపాయలకు చేరుకుంది. రానున్న పదిహేను రోజుల్లో బెల్లం ధర 10 కిలోలకు రూ.6 నుంచి 7 రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అటు చక్కెర కార్మాగార ప్రతినిధులు మద్దతు ధర పెంచకపోవడంతో పాటు ఇటు బెల్లం ధరలు తగ్గిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement