
సాక్షి, విజయవాడ : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం లేదని రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు మాజీ సభ్యులు, రైతు సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహితా – చేవెళ్ల అనే మెగా ప్రాజెక్టు చేపట్టిందని, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గోదావరి నది కాలువగా ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిండని వివరించారు.
గోదావరి జల్లాల్లో తెలంగాణకు కేటాయించిన 936 టీఎంసీలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 350 టీఎంసీల నీటిని వినియోగించుకుంటారని తెలిపారు. ఈ నీటిని వినియోగించుకున్నా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 300 టీఎంసీలు, దిగువన మరో 500 టీఎంసీల నీటికి ఢోకా ఉండదని తెలిపారు. గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ 10 వరకు 100 రోజుల్లో సుమారు 80 రోజులు మిగులు జలాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా – పెన్నా నదులకు తరలించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ కలిసి వస్తే పులిచింతల ఎగువన కృష్ణానదిపై 2 బ్యారేజలు నిర్మించి సాగర్ టెయిల్‌పాండ్‌లోకి, అక్కడ నుంచి సాగర్‌లోకి నీటిని ఎత్తిపోయాలన్నారు. శ్రీశైలం వద్దకు చేరిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రాజెక్టులు ప్రణాళిక బద్దంగా వాడుకోవచ్చన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో వెనులుబాటు కల్పించిన డెసిషన్–ఇంప్లిమెంటేషన్ బోర్డ్ ఏర్పరచుటకు వీలుగా సుప్రీం కోర్టులలోను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందున్న దావాలను ఇరు రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలన్నారు.