బంగారం వేలం వేశారని.. | farmers cncern in front of tamil nadu bank due to gold auction | Sakshi
Sakshi News home page

బంగారం వేలం వేశారని..

Jul 27 2014 1:27 AM | Updated on Oct 1 2018 2:03 PM

చెప్పాపెట్టకుండా తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలను వేలం వేశారని రైతులు స్థానిక తమిళనాడు బ్యాంక్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు.

నంద్యాల రూరల్: చెప్పాపెట్టకుండా తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలను వేలం వేశారని రైతులు స్థానిక తమిళనాడు బ్యాంక్ ఎదుట శనివారం ఆందోళన కు దిగారు. తమ నగలను తిరిగి ఇచ్చేయాలని నినాదాలు చేశారు. నంద్యాల డివిజన్‌లోని పాణ్యం, మహానంది, రుద్రవరం, శిరివెళ్ల, నంద్యాల, గోస్పాడు, గడివేముల తదితర మండలాలకు చెందిన రైతులు వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు, విజయభాస్కర్, విశ్వనాథరెడ్డి, మల్లేష్ లతో పాటు 170 మంది రైతులు రెండున్నరేళ్ల క్రితం బంగారు నగలను తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు.

 నెలల తరబడి వడ్డీ చెల్లించలేదంటూ వారిలో 40మంది రైతులకు సంబంధించిన బంగారాన్ని ఈనెల 19న బ్యాంక్ వేలం వేసింది.  ఈ సమాచారం ఆలస్యంగా తెలియడంతో కొందరు రైతులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు.  వడ్డీ చెల్లిస్తాం తాకట్టు బంగారాన్ని తిరిగి ఇవ్వాలంటూ  బ్యాంక్ సిబ్బందిని అడగగా వారు తిరిగి ఇవ్వలేమంటూ సమాధానం చెప్పడంతో  బ్యాంక్ ఎదుటే  బైఠాయించారు. వీరికి సీపీఐ కార్యదర్శి బాబాఫకృద్దీ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బాలు, ఏఐవైఎఫ్ నాయకులు ఏసయ్యలు మద్దతుగా నిలిచి నిరసన తెలిపారు.

  సమస్య తీవ్రం కావడంతో వన్‌టౌన్ ఎస్‌ఐ రాము, సిబ్బందితో అక్కడికి చేరుకుని బ్యాంక్ మేనేజర్, రైతులతో మాట్లాడారు. బ్యాంక్‌మేనేజర్ సురేష్‌కుమార్ మాత్రం  బాధిత రైతులకు ఇప్పటికే మూడు విడతలుగా నోటీసులు పంపించామని, వారు స్పందించకపోవడంతో వేలం వేయాల్సి వచ్చిందని  తెలిపారు.  ఇదిలా ఉంటే తమ నగలు తిరిగి ఇచ్చే వరకు ఆందోళనలు చేస్తామని రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement