
ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు రా
నిన్ను, నీ పిల్లలను నేను చూసుకుంటా
ఒంటరి మహిళకు నంద్యాల సీఐ వేధింపులు
నమ్మించి పర్సనల్ వీడియోలు, ఫొటోలు తీశారు
వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
డీఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు
కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగట్లేదు
మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన
సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.
ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్‌లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.
పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతా
నా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.
నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితురాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్‌లో వివరణ కోరగా స్పందించలేదు.