ఉల్లి కోసం రైతు హత్య! | Farmer Murdered For a quintal of Onions in Rangareddy District | Sakshi
Sakshi News home page

ఉల్లి కోసం రైతు హత్య!

Nov 1 2013 12:35 AM | Updated on Oct 1 2018 4:45 PM

హత్యకు గురైన ఎల్లయ్య - Sakshi

హత్యకు గురైన ఎల్లయ్య

ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది.

నవాబుపేట, న్యూస్‌లైన్: ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది. బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊరడి ఎల్లయ్య(60) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, క్యారెట్, వంగ సాగు చేశాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. పొలం వద్ద ఇదివరకే క్వింటాలు ఉల్లిగడ్డలను విత్తనం కోసమని గడ్డికప్పి దాచి ఉంచారు. దాని పక్కనే ఉన్న చెట్టు కింద ఎల్లయ్య నిద్రపోయాడు.

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, ఉల్లిగడ్డలను సంచుల్లో నింపుకుంటుండగా ఎల్లయ్య నిద్ర లేచి వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు ఎల్లయ్య తలపై కర్రతో గట్టిగా మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు ఉల్లిగడ్డలను అక్కడే వదిలి పారిపోయారు. గురువారం ఉదయం పక్కపొలం రైతులు.. ఎల్లయ్య చనిపోయిన విషయం గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు.

భూ తగాదాలే కారణమై ఉండొచ్చు: ఎస్పీ
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ... భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని, ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారని చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని గురువారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement