అందని పరిహారం..ఆగిన రైతు గుండె!

Farmer Died With Heart Stroke in Srikakulam - Sakshi

లింబుగాంలో  గుండెపోటుతో ‘తిత్లీ’ బాధితుడి మృతి

కుమార్తె పుట్టినరోజే దుర్ఘటన

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

ప్రభుత్వం తీరుతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తిత్లీ తుపాను నష్టపరిహారం అందక రైతు గుండె బద్దలైంది. మందస మండలం అంబుగాం పంచాయతీ లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33) వివిధ పంటలను సాగు చేస్తుండేవాడు. తిత్లీ తుపానుతో పది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే రూపాయి కూడా పరిహారం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం గుండె పోటుతో చనిపోయాడు. కుమార్తె పుట్టిన రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మందస:  తిత్లీ తుపాను సమయంలో అనర్హులకు లక్షలాది రూపాయలను చెల్లించిన ప్రభుత్వం నిజంగా నష్టపోయిన వారిని మాత్రం విస్మరించింది. దీంతో అలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. మందస మండలంలోని భేతాళపురంలో ఇప్పటికే ఒకరు చనిపోగా.. గురువారం ఓ రైతు గుండె ఆగిపోవడం చర్చనీయాంశవైంది. గత ఏడాది అక్టోబర్‌ 10, 11 తేదీల్లో సంభవించిన తిత్లీ తుపానుతో లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33)కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల్లో కొబ్బరి, మరో మూడు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు, వరి పంట పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు.

సుమారు 10 ఎకరాల పంట నష్టం జరగడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 5 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం మంజూరైనట్టు ఆన్‌లైన్‌లో చూపెడుతోంది. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు మొత్తం రూ.3.87 లక్షలు మంజూరైనట్టు అధికారులు అతనికి తెలియజేశారు. అయితే ఆ డబ్బులు కూడా రైతు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. గ్రామానికి చెందిన చాలామందికి పరిహారం డబ్బులు వచ్చినప్పటికీ తమకు ఎందుకు రాలేదోనని భార్య గీతాంజలి వద్ద శ్రీనివాసరావు రోజూ బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు సీతయ్య, ఇళ్లమ్మలకు శ్రీనివాసరావు ఒక్కగానొక్క కుమారుడు కాగా, వారసత్వంగా వచ్చిన తోట ఫలసాయంతో కుటుంబాన్నిపోషిస్తున్నాడు. కొంతమంది వ్యాపారుల వద్ద కూడా శ్రీనివాసరావు కొంతమొత్తాన్ని అప్పుగా తెచ్చాడు. అయితే ఇటీవల వీరి నుంచి డబ్బులను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడం, తిత్లీ తుపాను పరిహారం రూపాయి కూడా రాకపోవడంతో మనోవేనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం గుండె ఆగి శ్రీనివాసరావు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమార్తె లాస్య (8), కుమారుడు లోహిత్‌ (6) ఉన్నారు.

కుమార్తె పుట్టిన రోజునే తండ్రికన్నుమూత!
 కుమార్తె లాస్య 8వ పుట్టినరోజు గురువారమే. ఇదే రోజున తండ్రి మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. భార్య గీతాంజలిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

సీదిరి పరామర్శ
గుండెపోటుతో చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పరామర్శించి ఓదార్చారు. మృతదేహంపై పూలదండను ఉంచినివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, పార్టీ నాయకులు బదకల జానకిరావు, మద్దిల బాలకృష్ణలు కూడా ఉన్నారు.

యాదవకుల సంక్షేమ సంఘం సంతాపం
పంట నష్టపరిహారం అందక మరణించిన   శ్రీనివాసరావు కుటుంబాన్ని యాదవ కుల సంక్షేమ సంఘం నాయకులు రాపాక చిన్నారావు, మామిడి మాధవరావులు పరామర్శించి తీవ్ర సంతాపం తెలియజేశారు. తిత్లీ తుపాను ప్రభావం ఉద్దానంపై ఎలా ఉంటుందో ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు వివరించామని, అయినా వారిలో స్పందనలేదన్నారు. బాధితులకు నష్టపరిహారం అందకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top