ఉక్కరిబిక్కిరి బాలింతల వ్యథ | Fans Not Working in Maternity Ward West Godavari | Sakshi
Sakshi News home page

ఉక్కరిబిక్కిరి బాలింతల వ్యథ

May 13 2019 1:41 PM | Updated on May 13 2019 1:41 PM

Fans Not Working in Maternity Ward West Godavari - Sakshi

సీలింగ్‌ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేక టేబుల్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకున్న రోగులు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని బాలింత వార్డు నరకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. నవమాసాలు కష్టాలు పడుతూ చివరికి శిశువులకు జన్మనిస్తున్న తల్లుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. మండు వేసవి కావటంతో తీవ్రమైన ఉష్టోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బాలింతలు, పసిబిడ్డలు మాడిపోతున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని బాలింత వార్డులో తీవ్ర ఉక్కపోతతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. సర్కారు దవాఖానాలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. బాలింతల బాధలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారంతా గగ్గోలు పెడుతున్నారు.  ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో బాలింతల వార్డులో వారు పడుతున్న పాట్లకు ఈ చిత్రాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఒకవైపుఎండలు భగభగ మండిపోతుంటే.. బాలింతల వార్డులో కనీసం సౌకర్యాలు లేక తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలికూడా రాకపోవటంతో బాలింతల బంధువులు కొత్తగా టేబుల్‌ ఫ్యాన్లు కొనుగోలు చేసి మరీ ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వార్డులో ఏసీ ఉన్నా నెలరోజుల నుంచి పనిచేయటంలేదు. ఏసీ ఏర్పాటు చేసేందుకు తలుపులు, కిటికీలను సైతం పూర్తిగా మూసివేయటంతో  గాలి ఆడక.. ఊపిరి తీసుకోవటమే కష్టంగా మారిందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్డులో ఉన్న ఒకటో, రెండో ఫ్యాన్లు సైతం పనిచేయని దుస్థితి నెలకొంది. దీంతో బాలింతలతో పాటు అప్పుడే పుట్టిన చిన్నారులు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పిల్లలు ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ బిడ్డల కోసం తల్లులు, వారి బంధువుల పాట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఒక్కో బెడ్‌ వద్ద ఒక్కో ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకుని కొద్దిపాటి ఉపశమనం పొందుతున్నారు. ఏసీ వార్డులో ఏసీలు పనిచేయటంలేదని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి కానరావటంలేదు. బాలింతల వార్డులో పరిస్థితిపై ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ నంబర్‌ పనిచేయటంలేదని సమాధానం వస్తోంది.

తట్టుకోలేకపోతున్నాం
వార్డులో బాలింతలు పడుతున్న బాధలు చెప్పలేం. కనీసం గాలి కూడా రాని పరిస్థితి. మేమే కొత్త ఫ్యాన్లు కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకున్నాం. చంటి బిడ్డలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలింతలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. వార్డులో చుట్టూ కిటికీలు సైతం మూసివేసి ఉండడంతో గాలి లోనికి వచ్చే అవకాశం లేదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవటంలేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా ఉంది. బాలింతలకు కనీసం గాలి ఆడేలా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.
– భాగ్యలక్ష్మి, బాలింత బంధువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement