విద్యార్థుల జీవితాలతో చెలగాటం

Fake Certificate issue in Private Degree College Prakasam - Sakshi

పామూరు: పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల బీటెక్‌ విద్యార్థులతో జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కొందరు విద్యార్థులు విజయవాడ, ఒంగోలులో బీటెక్‌ చదువుతుండగా వారి ఇంటర్మీడియెట్‌ సర్టిఫికెట్ల నకలుతో ఆ డిగ్రీ కళాశాల రికార్డుల్లో నమోదు చేసుకుని ఇక్కడ చదువుతున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. బాధిత విద్యార్థులు ప్రశ్నిస్తే వారు ఎదురు దాడికి దిగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాధిత విద్యార్థులు స్థానిక పోలీసుస్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ చదివారు. కోర్సు పూర్తయిన తర్వాత వారు తమ సర్టిఫికెట్లను తీసుకుని విజయవాడ, ఒంగోలులో ఇంజినీరింగ్‌లో చేరారు. వారిలో వేముల వాసు, వై.మోహన్‌కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌లో చేరారు. మరో విద్యార్థి వల్లపుశెట్టి సతీష్‌ ఒంగోలు ఫేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరంలో చేరాడు. బీటెక్‌లో ఫస్ట సెమ్‌ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్‌ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. 

వై.మోహన్‌కృష్ణ పేరున పామూరు డిగ్రీ కళాశాలలో ఫస్ట్‌ సెమ్‌ మార్కుల జాబితా, వై.మోహన్‌కృష్ణ బీటెక్‌ ఫస్ట్‌ సెమ్‌ మార్కుల జాబితా
ఇక్కడ గుట్టురట్టు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు నవశకం కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పథకం కింది బాధిత విద్యార్థులకు ఆర్థిక సాయం అందాల్సి ఉంది. పథకాలకు సంబంధించి ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మీ పేర్లు ఇంజినీరింగ్‌లో చూపడం లేదని, పామూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. వెంటనే పామూరు వచ్చి తమ ప్రాంతంలోని వలంటీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీ పేర్లు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు ఉన్నాయని చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. యాజమాన్యం స్పందించకపోగా బాధిత విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తాము డిగ్రీ ఫస్ట్‌ సెమ్‌లో ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరైనట్లు మార్కులు కూడా వేసి ఉన్నారని, తమ పేర్లను డిగ్రీ కళాశాల రికార్డుల నుంచి తొలగించాలని కోరితే వారు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.  

విచారించి చర్యలు తీసుకుంటాం: ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మా పేర్లు చేర్చి యాజమాన్యం మాకు అన్యాయం చేసిందని కొందరు బీటెక్‌ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం చర్యలతో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాని, ప్రశ్నిస్తే దూషిస్తున్నారని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకు కళాశాల యాజమాన్యం అందుబాటులో లేదు. వారిని పిలిపించి రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.చంద్రశేఖర్, ఎస్‌ఐ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top