నాణ్యమైన పత్తి విత్తనం దొరికేనా?

Fake Catton Seeds in Kurnool - Sakshi

ఒకవైపు నకిలీ, మరో వైపు హెచ్‌టీ పత్తి విత్తనాల వెల్లువ

విత్తన కంపెనీలపై కన్నెత్తి చూడని వ్యవసాయశాఖ

గుట్టు చప్పుడు కాకుండా  తరలిపోతున్న నకిలీ,     హెచ్‌టీ విత్తనాలు

ఈ సారి జిల్లాలో పత్తి సాగు భారీగా పెరిగే అవకాశం

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నా.. అత్యధికంగా పత్తి పంట వేస్తారు. మొత్తం సాగులో పత్తి దాదాపు 45 నుంచి 50 శాతం ఉంటుంది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,59,498 హెక్టార్లలో పత్తి సాగు కాగా ఈసారి  మరింత పెరిగే అవకాశం ఉంది.  అయితే, రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకడం  ప్రశ్నార్థకంగా మారింది. నకిలీ బీటీ పత్తి విత్తనాలు, హెచ్‌టీ విత్తనాలు చాప కింద నీరులాగా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ సారి ఇటు వ్యవసాయ అధికారులు, అటు విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇప్పటికే ఆదోని, కర్నూలు డివిజన్‌లలోని అనేక గ్రామాల్లో పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జూన్‌ 1 నుంచి  నుంచి ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుంది.  తొలకరి పలకరిస్తే ముందస్తుగానే పత్తి వేసుందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత ఏడాది నకిలీ పత్తి విత్తనాలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. ఈ సారి ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన  వ్యవసాయశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

గుట్టుగా సాగుతున్న హెచ్‌టీ పత్తి విత్తనాల దందా
గ్లెపోసెట్‌ కలుపు మందును తట్టుకునే హెచ్‌టీ పత్తి విత్తనాలు అటు పర్యావరణానికి, ఇటు జీవవైవిధ్యానికి ప్రమాదమనే కారణంతో  ఆ విత్తనాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. కానీ, జిల్లాలో 2017 ఖరీప్‌లో హెచ్‌టీ పత్తి సాగు భారీగానే అయింది.  ఈ పత్తి విత్తనాలను సాగు చేసినా, విత్తనాలను మార్కెటింగ్‌ చేసినా క్రిమినల్‌ కేసులు  నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ హెచ్చరించడమే తప్ప  నియంత్రణకు  చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.   

నకిలీలకు కేంద్రంగా కర్నూలు  
రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ఇటు నకిలీ బీటీ పత్తి విత్తనాలకు, హెచ్‌టీ పత్తి విత్తనాలకు  కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో ప్రధానంగా పత్తి గుంటూరు, ఒంగోలు, కృష్ణ జిల్లాల్లో సాగు అవుతోంది. ఆ జిల్లాలకు కర్నూలు జిల్లా నుంచే నకిలీ బీటీ విత్తనాలు, హెచ్‌టీ విత్తనాలు తరలుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలు నకిలీలకు పెట్టింది పేరుగా ఉన్నాయి.  అనేక మంది అక్రమార్కులు జిన్నింగ్‌ మిల్లుల నుంచి పత్తి విత్తనాలు తెచ్చు కొని వాటిని ప్రాసెసింగ్‌ చేసి రంగు అద్దుతున్నారు. తర్వాత వాటిని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి బ్రాండెడ్‌ విత్తనాలుగా మార్కెట్‌లోకి  వదిలి  ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.

బ్రాండెడ్‌ విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం !
గత ఏడాది బీజీ–2 పేరుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను మార్కెటింగ్‌ చేశారనే కారణంతో కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు చెందిన పలు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. ఒక కంపెనీ లైసన్‌ను పూర్తిగా రద్దు చేయగా... దాదాపు 15 కంపెనీలకు చెందిన బీజీ–2 రకాలను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. ఇందువల్ల ఈ సారి బ్రాంyð డ్‌ పత్తి విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

నిఘా పెంచుతున్నాం
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ముఖ్యంగా పత్తితో హెచ్‌టీ పత్తి విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.  ఈ విత్తనాలు అమ్మినా.. మార్కెటింగ్‌ చేసినా, సాగు చేసినా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాము. అన్ని ప్రాసెసింగ్‌ యూనిట్లను, ట్రాన్స్‌పోర్టు ఆఫీసులు తదితర వాటి తనిఖీలకు ఆదేశాలు ఇచ్చాం.  
–ఠాగూర్‌నాయక్, జేడీఏ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top