ఎంసెట్‌ దరఖాస్తులోనే 'ఈడబ్ల్యూఎస్‌ కోటా' కాలమ్‌ | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ దరఖాస్తులోనే 'ఈడబ్ల్యూఎస్‌ కోటా' కాలమ్‌

Published Tue, Feb 11 2020 4:05 AM

EWS quota column is the same as in the Eamcet application - Sakshi

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ సహా పలు సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్ల కల్పన ప్రక్రియను వాటి ప్రవేశ దరఖాస్తు స్థాయి నుంచే అమల్లోకి తేవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలిలో వివిధ సెట్‌ల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంసెట్, ఈసెట్‌లపై చర్చించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ రామ్మోహనరావు, ప్రొఫెసర్‌ లక్ష్మమ్మ, ఎంసెట్, ఈసెట్‌ల చైర్మన్లు ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు, ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాసకుమార్, సెట్ల కన్వీనర్లు, ప్రొఫెసర్‌ రవీంద్ర, ప్రొఫెసర్‌ భానుమూర్తి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్, మండలి కార్యదర్శి ప్రేమ్‌కుమార్, సెట్ల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో కూడా అమల్లోకి తెస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది ఎంసెట్‌ తర్వాత ఈ రిజర్వేషన్లు రావడంతో దరఖాస్తులో దాని గురించి ప్రస్తావించలేదు. సీట్ల కేటాయింపు సమయంలో కొంతమేరకు అవకాశం కల్పించారు. ఈసారి దరఖాస్తులోనే ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సంబంధించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకునేలా కొన్ని కాలమ్‌లను పెట్టాలని నిర్ణయించారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 24న విడుదల చేసి 26 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌ డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఈసెట్‌లో ఇక నుంచి అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ను కూడా చేర్చనున్నారు. 

నిర్వహణ సంస్థలకు చెల్లింపు మొత్తాల కుదింపు
ఎంసెట్‌ తదితర పరీక్షలకు సంబంధించి ఆయా నిర్వహణ సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రుసుములు చెల్లించారు. ఈసారి వాటిని బాగా కుదించారు. గతంలో ఎంసెట్‌కు సంబంధించి ఒక్కో విద్యార్థికి రూ.305 చొప్పున సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెల్లించారు. ఈసారి దాన్ని రూ.287కు తగ్గించారు. అలాగే సాఫ్ట్‌వేర్‌ సంస్థ.. ఎంసెట్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపునకు గేట్‌వే ఛార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 చొప్పున వసూలు చేసేది. ఈసారి దాన్ని కూడా తగ్గించాలని.. గేట్‌వే సేవల కోసం ఆయా బ్యాంకులు ఎంత మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నాయో ఆ మేరకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని సాఫ్ట్‌వేర్‌ సంస్థకు స్పష్టం చేశారు. వివిధ సెట్ల పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది వరకు హాజరవుతారు. ఈ తగ్గింపు వల్ల అటు మండలిపైనా, ఇటు విద్యార్థులపైనా భారం తగ్గుతుంది. 

Advertisement
Advertisement