ఊరంతా పులకింత

Establishment of village secretaries creating a new revolution - Sakshi

ఇంటి ముందుకే సంక్షేమ రథచక్రం

ఉద్యోగాల విప్లవం.. అందరిలోనూ ఆనందం

నిరుద్యోగుల్లోనూ నూతనోత్సాహం 

కేరింతలు.. కేక్‌ కటింగ్‌లు.. కోలాహలం.. రంగ వల్లులు

అవ్వాతాతల్లో ఆనందం.. రైతన్న కళ్లలో కొత్త వెలుగు

జన హృదయాంతరాల్లోంచి పెను తుపానులా తన్నుకొస్తున్న స్పందన  

సరికొత్త విప్లవం సృష్టిస్తున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు 

పల్లె పండుగ చేసుకుంటోంది. పట్నం వాసుల్లో గుండె ధైర్యం పెరిగింది. మాకిక బతుకు భరోసా లభించిందని ఊరూ వాడా భావిస్తోంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా చూస్తున్నామని ఊరూరూ సంబరపడిపోతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటవుతున్న ప్రతీచోట సందడి నెలకొంది. రాష్ట్రంలో ఆ చివర అనంతపురం జిల్లా మొదలు ఈ చివర శ్రీకాకుళం జిల్లా దాకా ఏ పల్లెకు వెళ్లి చూసినా సందడే సందడి. ఇక మాకు మంచి రోజులొచ్చాయని ప్రజలు ఆనందిస్తున్నారు. ‘సచివాలయ ఏర్పాటు’ ఏ స్థాయిలో జరుగుతోందో మంగళవారం ‘సాక్షి’ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించింది. గ్రామ స్వపరిపాలన సాక్షాత్కరించబోయే క్షణాల కోసం ఉద్విగ్నతతో కూడిన ఆనందంతో అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ కనిపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తమ బతుకు రాత మార్చబోతున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కరలేదని కుండబద్ధలు కొడుతున్నారు.   

పేద బతుక్కు భరోసా
విశాఖ ప్రాంతం నుంచి సాక్షి అమరావతి ప్రతినిధి : ‘పింఛన్‌ కోసం తొమ్మిదిసార్లు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని మధురవాడలోని కార్పొరేషన్‌ ఆఫీసుకు వెళ్లాను. తొమ్మిదిరోజుల కూలి పోయింది కానీ పని మాత్రం కాలేదు. ఇక పింఛన్‌ మీద ఆశ వదిలేసుకున్నా. ఇటీవల వలంటీర్‌ మా ఇంటికి వచ్చి మరీ పింఛన్‌ కావాలా.. ఇల్లు కావాలా.. అని అడిగారు. నాకేం పాలుపోలేదు. పేర్లు, వివరాలు రాసుకు వెళ్లారు. ఇంటికి వచ్చి మరీ ఏం కావాలని అడుగుతున్నారు అనుకున్నా. ఇప్పుడు ఇదిగో మా కాలనీ దగ్గరే సచివాలయం పెడతారని చెప్పారు. ఇక పింఛన్‌ మాత్రమే కాదు ఏ పని అయినా సరే ఇక్కడే అయిపోతుంది. ఇంతకంటే మాకేం కావాలి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని భీమిలి నియోజకవర్గం పరదేశీపాలెంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన వాచ్‌మ్యాన్‌ తుమ్మల జనార్దన్, విజయనగరం జిల్లా ఎస్‌.కోట భవానీనగర్‌కు చెందిన ఆడారి సరస్వతి నందంతో చెప్పారు. 

ఇక ఎవరితోనూ పని లేదు..
ఎన్టీరామారావు 1987లో ఏర్పాటు చేసిన మండల వ్యవస్థ తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగలేదు. ఈ 32 ఏళ్లలో ప్రజల అవసరాలు ఎన్నో రెట్లు పెరిగాయి.  గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలనను మా ముంగిటకే తీసుకువస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉందని విజయనగరం జిల్లా వేపాడకు చెందిన రామారావు అనే రిటైర్డ్‌ ఉద్యోగి చెప్పారు. ఏ పనైనా మండల కేంద్రానికి పదిసార్లు తిరగాల్సిన పని ఉండదని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన తవిటయ్య అన్నారు.  

ఇది విప్లవాత్మక నిర్ణయం
విశాఖపట్నంలోని మధురవాడ జోన్‌ పరిధిలో దాదాపు 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు వీరి కోసం ఏకంగా 91 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.  విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజక వర్గంలో 107 సచివాలయాలు ఏర్పాటవుతున్నాయి. దాంతో  సమస్యలు ఇట్టే పరిష్కారం కావడం ఖాయమని అటు అధికారులు ఇటు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘పరిపాలనా వికేంద్రీకరణ గురించి సిలబస్‌లో చదివాం. ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో చూపిస్తోంది’ అని విశాఖపట్నంలోని మధురవాడ జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము అన్నారు. ‘ఇన్నాళ్లూ సాధ్యం కాని మా భూ రికార్డులను ఇప్పుడు మార్పించుకుంటాం..’ అని  పరదేశీపలెంకు చెందిన రైతు బోర గోవిందరావు ఆశాభావం వ్యక్తం చేశారు.  

అదిగో ‘నవ’లోకం
రాజధాని ప్రాంతం నుంచి సాక్షి అమరావతి ప్రతినిధి : రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఊరు ఊరంతా రాజకీయాలకు అతీతంగా గ్రామ సచివాలయం ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనలో పాలుపంచుకోవడం కన్పించింది. అక్కడ ఏ అవ్వను కదిలించినా ఉద్వేగం తన్నుకొచ్చే మాటలే. ఏ అమ్మతో మాట కలిపినా గుండెల్లోంచి పెల్లుబికే ఆనందమే. ‘ఇళ్ళ కోసం మేమిక ఏ నేత చుట్టూ తిరగాల్సిన పని లేదయ్యా.. రేషన్‌ కార్డులు ఇదిగో ఇక్కడే తీసుకోవచ్చంట..’ అని అవ్వ సౌభాగ్యమ్మ చెప్పింది. ‘అవును.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇక్కడి జనం ఎక్కడికో వెళ్లి అధికారుల చుట్టూ తిరిగేవాళ్లు. గ్రామ సచివాలయం ఈ బాధలన్నీ తొలగిస్తుంది. అందుకే ఇక్కడి జనంలో అంత ఆనందం’ అని చెప్పింది ఆ ఊరి పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి. ‘వాళ్లే విజేతలన్నట్టు జనం స్పందిస్తున్నారు’ అన్నాడు వీఆర్‌వో మోహన్‌ రావు. ‘నా సర్వీసులో ప్రజలు ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోంది’ అన్నాడు జూనియర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జునరావు. ‘ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే నా బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయింది. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి’ అని ఆ గ్రామస్తుడు మురళీకృష్ణ గర్వంగా చెప్పాడు. ఇప్పటం గ్రామంలోనూ ఇదే కోలాహలం కనిపించింది.  

రంగ వల్లులు.. సంబరాలు
వినుకొండలోని ఒకటి, మూడు వార్డుల్లో సంక్రాంతి సందడి కన్పించింది. మహిళలంతా గ్రామ సచివాలయ ప్రాంగణానికి చేరుకుని ఆనందంతో నృత్యాలు చేశారు. ఉదయం నుంచే అక్కడ మహిళలు పూలతో రంగవల్లులు తీర్చి దిద్దారు. కేక్‌ కట్‌ చేసి సంతోషం పంచుకున్నారు ‘పాదయాత్రలో మాటిచ్చాడు.. రాగానే నవరత్నాలు తెచ్చాడు’ అని ఇందుమతి చెబుతున్నప్పుడు కళ్లలో ఆనంద భాష్పాలు తన్నుకొచ్చాయి. నాగలక్ష్మి, పావని, త్రివేణి, కల్పన, హాస్కీ భాను అడుగులో అడుగేస్తూ రంగవల్లి చుట్టూ చప్పట్లు కొడుతూ ‘జై జగన్‌’ అంటూ నినదించారు. గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగంణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన పలు ప్రాంతాల యువతీ, యువకులు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ‘ఇది కలా.. నిజమా.. నెలలోగా ప్రభుత్వ ఉద్యోగం..’ అని ఆవుల గోపి, ఉదయశ్రీ , మౌనిక, మల్లికార్జున్, హరిణి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
 
బంగారం లాంటి అవకాశం కోల్పోయా
తాడేపల్లి మండలం ఇప్పటంలో సచివాలయ కోలాహలం చూసేందుకు వచ్చిన ఓ యువతి.. ఉద్యోగస్తురాలైన తన స్నేహితురాలి తల్లిని పలకరించింది. ‘చిన్నప్పుటి నుంచీ అన్నింట్లోనూ నువ్వు ఫస్టే. గ్రామ సచివాలయం పరీక్ష రాసింటే నీకూ ఉద్యోగం వచ్చేది కదమ్మా..’ అనడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ‘మా నాన్న తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు చెప్పిన మాటే విన్నాడు. ఆ ఉద్యోగాలు మనలాంటోళ్లకు రావు.. వైసీపీ వాళ్లకే వస్తాయి.. అని చెప్పాడు. అందుకే నేను పరీక్ష రాయలేదు. ఇప్పుడు చూస్తే మా ఊళ్లోనే ఎంతో మంది టీడీపీ వాళ్లకు ఉద్యోగాలొచ్చాయి.   నేను, మా అమ్మ బాగా ఏడ్చాం. వచ్చిన అవకాశం చేజార్చుకున్నా’ అంటూ కన్నీటి పర్యంతమైంది.  

టీడీపీ వాళ్లం కదా.. ఉద్యోగం రాదనుకున్నా
మాది అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం. 2013లో టీడీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యా. 2018లో పదవీ కాలం ముగియటంతో మళ్లీ ఉద్యోగ వేట ప్రారంభించాను. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ.. టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన నాకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగం వస్తుందా అనే అనుమానం కలిగింది. అయినా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5 ఉద్యోగం వచ్చింది. పరీక్షల వంద శాతం పారదర్శకంగా జరిగాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ.    
– వై.వెంకటలక్ష్మి, ఇమాంపురం

ఏ పార్టీ వాళ్లనేది చూడలేదు
మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సతివాడ గ్రామం. టీడీపీ సానుభూతిపరునిగా ఉన్నప్పటికీ నాకు గ్రామ సచివాలయంలో కార్యదర్శి పోస్టు వచ్చింది. మా నాన్నగారి మేనమామ చింతపల్లి వెంకటరమణ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూడా. చిన్న తాతయ్య రెడ్డి కురిమినాయుడు మాజీ ఉప సర్పంచ్‌. ఎవరు ఏ పార్టీ వాళ్లనేది చూడకుండా ఉద్యోగాలిచ్చారు.     
– రెడ్డి సురేష్‌

టీడీపీ ఎంపీటీసీగా చేసినా.. 
మాది కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం జువ్వనపూడి. టీడీపీ తరఫున కొన్ని నెలల క్రితం వరకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా పనిచేశా. ఇప్పుడు సచివాలయ పరీక్ష రాసి ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్‌గా నియామక పత్రం అందుకున్నా. పరీక్షలు చాలా పారదర్శకంగా నిర్వహించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు.    
– యు.నాగలక్ష్మి, జువ్వనపూడి

టీడీపీ వాళ్లమైనా ఉద్యోగమొచ్చింది
మాది అనంతపురం జిల్లా మడకశిర మండలం చందకచర్ల. మా నాన్న కిష్టప్ప టీడీపీ సీనియర్‌ నాయకుడు. గ్రామ సచివాలయ పోస్టుల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. నియామక పత్రం కూడా తీసుకున్నాను. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది.    
– కె.అపర్ణ, చందకచర్ల

నేను టీడీపీ మాజీ ఎంపీటీసీని..
మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. నేను గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా పని చేశాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సర్కారు కొలువు దక్కడం ఆనందంగా ఉంది. హార్టీకల్చర్‌ డిప్లమో పూర్తిచేసిన నాకు చదువుకు సంబంధించిన ఉద్యోగం రావడం.. అది కూడా పక్క మండలంలోనే పోస్టింగ్‌ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.        
– మేడిది రమాదేవి, నరసాపురం

మా నాన్న టీడీపీ నాయకుడే..
నేను బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నాను. ఇటీవల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాను. మా నాన్న శీలం శ్రీనివాసరావు టీడీపీ నాయకుడనే విషయం చాలా మందికి తెలుసు. నేను ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు.   
 – శీలం ప్రియాంక, పెదవడ్లపూడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top