గజం 6000 | Episode Transcript medaranlo rentals | Sakshi
Sakshi News home page

గజం 6000

Jan 30 2014 2:47 AM | Updated on Sep 2 2017 3:09 AM

మేడారంలో గజం భూమి అద్దె అక్షరాలా ఆరువేల రూపాయలు. జాతరప్పుడు తప్ప జన సంచారం పెద్దగా ఉండని అక్కడ అంత ధరా..!

సాక్షి, హన్మకొండ : మేడారంలో గజం భూమి అద్దె అక్షరాలా ఆరువేల రూపాయలు. జాతరప్పుడు తప్ప జన సంచారం పెద్దగా ఉండని అక్కడ అంత ధరా..! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కూడా అంత లేదే.. ఇక్కడెందుకు ఇలా .. అని ఆలోచనలో పడక్కర్లేదు. ప్రస్తుతం ఇక్కడ పలుకుతున్న అద్దెల ధరలు మహానగరాలతో పోటీపడుతున్నాయి. వచ్చేనెలలో నాలుగు రోజులపాటు కనులపండువగా జరిగే జాతరకు కోటిమందికిపైగా భక్తులు వస్తారని అంచనా.  అందుకుతగ్గట్టే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారం చేసుకోవాలంటే స్థలం కావాలిగా.. అది కావాలంటే అద్దెకు తీసుకోవాలిగా. అందుకే.. అక్కడ ఆ నాలుగు రోజులు స్థలాలకు అంత గిరాకీ.
 
పక్షం రోజులముందే..
 
వచ్చేనెల 12నుంచి 15వ తేదీ వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి  పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. వీరి అవసరాలు తీర్చేందుకు జాతర పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పెరడుతోపాటు పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. ఇక వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. దీంతో ఇక్కడి స్థలాలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. జాతరకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉండగానే స్థలాలకు బుకింగ్‌లు కూడా పూర్తికావచ్చాయి.
 
రెండు కిలోమీటర్లు.. దారికిరువైపులా..
 
గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. మేడారంలో ఉన్న ఇళ్ల వరండాలో గజం స్థలం విలువ సగటున ఐదువేల రూపాయలు పలుకుతోంది. గద్దెల చుట్టూ వందమీటర్ల వరకు అన్ని వైపులా గజం స్థలం  విలువ రూ.ఆరువేలుగా ఉంది. జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.నాలుగువేలు. స్థలం అద్దెలు ఆకాశంలో ఉన్నా ఇప్పటికే ఇవన్నీ బుక్ అయిపోవడం విశేషం. ఇక జంపన్నవాగు నుంచి గద్దెల వరకు గజం భూమి విలువ రూ.ఐదువేలు పలుకుతుండగా రెడ్డిగూడెం, నార్లాపూర్, స్థూపం సెంటర్, ఆర్టీసీ బస్‌స్టేషన్ చుట్టుపక్కల ఉన్న స్థలాల గజం విలువ సగటున నాలుగువేల రూపాయలుగా ఉంది.
 
ఇంటికి రూ.పదివేలు
 
జాతర పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెంలో ఇళ్ల కిరాయిలు ఆకాశంలో విహరిస్తున్నాయి. దీని తర్వాత స్థానాల్లో కన్నెపల్లి, నార్లాపూర్, ఊరట్టం గ్రామాలున్నాయి. జాతర జరిగే రోజుల్లో మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో ఒక గది అద్దె రూ. ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పలుకుతోంది. గదుల అద్దె విషయంలో మేడారంతో రెడ్డిగూడెం పోటీ పడుతుండగా ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్‌లో ఇందులో సగం ధరకే గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక పొలాల్లో పందిళ్లు వేసుకుని బస ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు కూడా గజం స్థలానికి వెయ్యి నుంచి మూడువేల రూపాయలు సమర్పించుకోవాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement