చిత్తశుద్ధితో చట్టాల అమలు | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో చట్టాల అమలు

Published Wed, Aug 7 2019 4:12 AM

Enforcement of laws with integrity - Sakshi

సాక్షి, అమరావతి: కేవలం చట్టాల రూపకల్పనతోనే సరిపుచ్చకుండా ఎన్నికల హామీ మేరకు వాటి అమలుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. గత సర్కారు హయాంలో పేరుకు మాత్రం అసెంబ్లీలో చట్టాలు చేయడం ఆ తరువాత కీలకమైన రూల్స్‌ను రూపొందించకుండా పక్కనపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉండగా వాటర్‌ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. అయితే ఆ చట్టం అమలుకు కీలకమైన రూల్స్‌ను మాత్రం రూపొందించలేదు. గత సర్కారు నిర్వాకాలకు ఇదో ఉదాహరణ మాత్రమే. 

28 లోపు రూల్స్‌ జారీ చేయాలి: సీఎస్‌
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చేసిన పలు కీలక చట్టాలను తక్షణం అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్యలు చేపట్టారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొన్ని చట్టాలకు సవరణలు, మరికొన్ని కొత్త చట్టాలను చేసింది. ఇవి అమల్లోకి రావాలంటే రూల్స్‌ రూపొందించాల్సి ఉంది. అవి లేకుండా చట్టాల అమలు సాధ్యం కాదు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చేసిన చట్టాలకు సంబంధించి ఈనెల 28వ తేదీలోగా రూల్స్‌ను జారీ చేయాలని సంబంధిత శాఖలకు సీఎస్‌ ప్రత్యేక నోట్‌ పంపించారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ల్యాండ్‌ అండ్‌ దేవదాయ), రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎక్సైజ్‌–వాణిజ్య పన్నులు), పాఠశాల విద్య, ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి సీఎస్‌ ప్రత్యేక నోట్‌ను పంపారు. 

రెండు వారాల్లోగా బిజినెస్‌ రూల్స్‌ రూపకల్పనకు ఆదేశం
చట్టాల స్ఫూర్తి, ఉద్దేశాలకు ఎక్కడా విఘాతం కలగకుండా రూల్స్‌కు రూపకల్పన చేయాలని సీఎస్‌ ఆదేశించారు. సంబంధిత శాఖలు రెండు వారాల్లోగా బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం రూల్స్‌ రూపొందించాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే సీఎస్‌ను సంప్రదించాలని అందులో సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 28వ తేదీ కన్నా ముందుగానే రూల్స్‌ జారీ చేయాల్సిందేనని, ఇందులో జాప్యం చేస్తే సహించేది లేదని సీఎస్‌ స్పష్టం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement