ఏసీబీకి చిక్కిన ఐకేపీ ఉద్యోగి | Employee involved in possible ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఐకేపీ ఉద్యోగి

Feb 28 2014 1:15 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కిన ఐకేపీ ఉద్యోగి - Sakshi

ఏసీబీకి చిక్కిన ఐకేపీ ఉద్యోగి

ఉపాధి కూలీలకు చెల్లింపులు చేపట్టే గ్రామైక్య సంఘానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక కమీషన్ చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) కమ్యూనిటీ కో-ఆర్డినేటర్

  •      ఉపాధి కమీషన్ చెల్లింపునకు లంచం డిమాండ్
  •      రూ.15వేలు తీసుకొంటూ దొరికిపోయిన ఐకేపీ సీసీ
  •  పాడేరు, న్యూస్‌లైన్ : ఉపాధి కూలీలకు చెల్లింపులు చేపట్టే గ్రామైక్య సంఘానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక కమీషన్ చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి) ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహరావు నేతృత్వంలో హుకుంపేటలో ఈ దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీలోని గ్రామైక్య సంఘం కోశాధికారి బూర్జబారిక కుమారి ఉపాధి కూలీలకు గతంలో రూ.87 లక్షలు పంపిణీ చేశారు.

    ఇందుకు  ప్రభుత్వం రెండు శాతం కమీషన్‌గా రూ.1.74లక్షలు మంజూరు చేసింది. ఇవి చెల్లింపునకు రోజుల తరబడి ఐకేపీ సీసీ తాతాలు చుట్టూ గ్రామైక్య సంఘం సభ్యులు తిరుగుతున్నారు. ఈ నెల 20న రూ.1.07లక్షలకు చెక్ ఇచ్చారు. మిగతా రూ.67 వేల కోసం కోశాధికారి కుమారి అనేక సార్లు సీసీని ప్రాథేయపడ్డారు. రూ.30వేలు లంచం ఇస్తేనే ఈ బిల్లు మంజూరు చేస్తానని అతను తేల్చి చెప్పారు. సంఘానికి చెందిన సొమ్ములో ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా ఇవ్వలేమని, మహిళలంతా బతిమలాడినా సీసీ కరుణించలేదు. చివరకు రూ.15 వేలు ఇచ్చేందుకు మహిళలు అంగీకరించారు.

    ఈ వ్యవహారాన్ని కోశాధికారి కుమారి మామ బూర్జబారిక నిమ్మిరావు ఇటీవల విశాఖపట్నంలోని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనమేరకు రూ.15 వేలను నిమ్మిరావు హుకుంపేటలో ఉంటున్న సీసీ తాతాలుకు గురువారం అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు చుట్టుముట్టి సీసీని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు మండల పరిషత్ కార్యాలయానికి తాతాలును తరలించి విచారించారు. పలువురు ఐకేపీ అధికారులను కూడా విచారించిన అనంతరం సీసీ తాతాలుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విశాఖపట్నంకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement