ఆపరేషన్‌ గజేంద్రలో మరో అపశ్రుతి

Elephants Attack Man Killed In Meliaputti - Sakshi

ఏనుగుల దాడిలో పెద్దమడి కాలనీ వాసి మృతి 

భయం గుప్పెట్లో గిరిజనులు

నందకొత్తూరు ప్రాంతంలో ఏనుగుల తిష్ఠ

మెళియాపుట్టి : మెళియాపుట్టి మండలంలో ఏనుగుల తిష్ఠ వేయడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. నందవ, పరశురాంపురం ప్రాంతానికి చేరిన ఏనుగుల గుంపు రెండు రోజుల్లో ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాయి. ఈ నెల 14న హీరాపురం వద్ద జీడితోటలో పిక్కలు ఏరుతున్న  వృద్ధురాలు మెళియాపుట్టి నీలమ్మను ఏనుగులు తొక్కి చంపగా, ఆదివారం పెద్దమడి కాలనీకి చెందిన సవర రామారావు(45)ను ఏనుగులు హతమార్చాయి. రామారావు జీడితోటల వైపు పశువులను మేత కోసం తీసుకొని వెళ్లగా జీడితోటల్లో తిష్ఠవేసి ఉన్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపాయి. కుటుంబీకులు గత రెండు రోజులుగా  రామారావు కోసం గాలింపు చేపట్టిన గుర్తించ లేకపోయారు.

మంగళవారం శవం కుళ్లిన వాసన రావడంతో స్థానికులు తోటల్లోకి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. వరుసగా ఇద్దరు గిరిజనులు మృత్యువాత  పడడంతో స్థానికులు భయాందోళ చెందుతున్నారు. ఆపరేషన్‌ గజేంద్ర తమ ప్రాణాలపైకి వచ్చిందని మండిపడుతున్నారు. రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాత పడడంతో ఏం చేయాలో అర్థకాక అటవీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కాగా సంఘటనా స్థలాన్ని జిల్లా అటవీశాఖ అధికారి శాంతి స్వరూప్,  ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారులు సందర్శించారు. రామారావు మృతదేహం   కుళ్లిపోవడంతో వైద్యుడ్ని రప్పించి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

‘సంఘటన దురదృష్ఠకరం’
ఏనుగుల దాడిలో మరో వ్యక్తి చనిపోవడం  దురదృష్టకరమని డీఎఫ్‌ఓ శాంతి స్వరూప్‌ అన్నారు.  సంఘటన స్థలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అందవలసిన సహాయాన్ని అందిస్తామన్నారు. ఏనుగుల గుంపును ఒడిశా అడవుల్లోకి పంపించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.  

గిరిజనుల ఆందోళన 
ఏనుగులను ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు సాగుతున్న ఆపరేషన్‌ గజేంద్రకు అంతరాయం కలుగుతోంది. గిరిజనులు మృత్యువాత పడుతుండడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెద్దమడి కాలనీ చెందిన సవర రామారావు మృతి చెండంతో గిరిజన సంఘ జేఏసీ నాయకులు వాబ యోగి, సీహెచ్‌ శాంతారావు, ఎండయ్య, దుర్యోధన ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామ మెయిన్‌ రోడ్డుపై మంగళవారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆపరేషన్‌ గజేంద్ర పేరుతో హత్యా కాండ చేస్తోందని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, డీఎఫ్‌ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  గిరిజనులు చేపట్టిన ధర్నా స్థలానికి ఎస్‌ఐ రాజేస్, సిబ్బంది చేరుకొని గిరిజనులను శాంతింప చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top