స్తంభం ఎక్కేదెవరు..?

Electricity Department Not Filling Linemen Vacancies  - Sakshi

సాక్షి, విజయనగరం : ఈ నెల 20న పట్టణంలోని ప్రదీప్‌నగర్‌ ప్రాంతంలో ఉదయం 7.30 గంటలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా 11 గంటల వరకు రాలేదు. సుమారు 3.30 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయాన్ని  విద్యుత్‌ శాఖ అధికారులకు తెలిజేస్తే సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో తెలుసుకునేందుకు అధిక సమయం తీసుకున్నారు. సుమారు 80 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఇద్దరు లైన్‌మన్‌లు తనిఖీ చేసే సరికి ఆ సమయం పట్టింది. సమస్యను  అన్వేషించి  పరిష్కార చర్యలు చేపట్టలోగా ఆ ప్రాంత వాసులు పడిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు.

ఈ పరిస్థితి కేవలం విజయనగరం పట్టణంలోని ప్రదీప్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ప్రజలకే పరిమితం కాదు.. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి సమస్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా భారీ ఈదురుగాలులు వీచే సమయాల్లో.. భారీ వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రోజు రోజుకూ అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా విస్తరిస్తున్న విజయనగరం డివిజన్‌లో ఇటువంటి సమస్యలను గుర్తించి, పరిష్కరించే కీలకమైన ఉద్యోగులు తక్కువగా  ఉండడం శోచనీయం. 

200 మందితోనే నడిపిస్తున్నారు..
విద్యుత్‌ శాఖలో కీలకమైన లైన్‌మన్‌ పోస్టుల నియామకాలు, భర్తీ విషయంలో  జాప్యం జరుగుతుండడంతో.. ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. చిన్నపాటి సమస్య వచ్చినా స్తంభమెక్కెందేకు అవసరమైన సిబ్బంది లేక  వినియోగదారులకు జేబులు గుల్ల చేసుకుంటున్న పరిస్థితులు కోకొల్లలు. విజయనగరం డివిజన్‌లో 3.50 లక్షల విద్యుత్‌ సర్వీసులుండగా.. చిన్న, చిన్న సమస్యలు పరిష్కరించేందుకు 200 మంది మాత్రమే లైన్‌మన్‌లు ఉన్నారు.

వాస్తవానికి  దశాబ్దాల కిందట ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అప్పటి సర్వీసులకు అనుగుణంగా 300 మంది వరకు జూనియర్, సీనియర్‌ లైన్‌మన్‌ ఉండాలి. అయితే 100 మంది సిబ్బంది తక్కువగా ఉండడంతో ఉన్న వారిపైనే  అదనపు పని భారం పడుతోంది. సా«ధారణ రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా వీరంతా సేవలందిస్తున్నప్పటికీ  విపత్కర సమయాల్లో (భారీ ఈదురుగాలులు, వర్షాలు కురిసే) మాత్రం ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా వి«ధులు నిర్వహించాల్సి వస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఎడతెగని జాప్యం..
అత్యవసర సేవల్లో ఒక్కటిగా మారిన విద్యుత్‌ సేవల విషయంలో జాప్యం జరిగితే వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. క్షణ కాలం విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఆపసోపాలు పడిపోతున్నారు. అటువంటిది గంటల సమయం కోత విధిస్తే ఇక అంతే మరి. ఈనెల 16వ తేదీ సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు రాత్రి 7.45 గంటల నుంచి అర్ధరాత్రి 1.15 గంటల వరకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ రాత్రంతా వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలనుగుణంగా ప్రతి ఇంటిలోనూ ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి  విద్యుత్‌ గృహోపకరణాల వినియోగం రోజు రోజుకు అధికమవుతుండగా... విద్యుత్‌ సరఫరా చేయడం అధికారులకు సైతం పెను సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సిబ్బంది  నియామకాలు పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. 

ఎంత మంది ఉండాలంటే...?
విద్యుత్‌ చట్టం ప్రకారం  ప్రతి 1000 విద్యుత్‌ సర్వీసులకు ఒక లైన్‌మన్‌ ఉండాలి. ఇది విద్యుత్‌ చట్టం చెబుతున్న సత్యం. అయితే విజయనగరం డివిజన్‌లో మాత్రం ఉన్న సర్వీసులకు అనుగుణంగా అవసరమైన లైన్‌మన్‌లు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. డివిజన్‌లో 3లక్షల 50 వేల విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. ఈ లెక్కన 350 మంది వరకు లైన్‌మన్‌లు ఉండాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం 200 మంది మాత్రమే ఉన్నారు. దీంతో  విద్యుత్‌ శాఖలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి  ఎక్కువ సమయం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరంతా క్షేత్ర స్థాయిలో సమస్యను గుర్తించి స్తంభమెక్కి  వాటిని సరి చేయాల్సి ఉంటుంది 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top