కొత్త నిబంధనలతో వాటిని కాంట్రాక్టులకు దూరంచేసే యత్నం
గతంలో 113 మార్కులుంటే టెండర్ దాఖలుకు అర్హత
ఇప్పుడది 124 మార్కులకు పెంచేసిన బాబు సర్కార్
150కి 113 మార్కులు పొందడమే చిన్న సంస్థలకు కష్టం
అది తెలిసే బడా సంస్థలకు అనుకూలంగా మార్పులు
ఎంఎస్‌ఎంఈలను నిర్వీర్యం చేసి పెద్ద కంపెనీలకు రెడ్ కార్పెట్
50% మెటీరియల్ ఎంఎస్‌ఎంఈల నుంచే కొంటామన్నదీ ఒట్టిమాటే
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖలో టెండర్లన్నీ కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకే దక్కుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోందనేది ఇన్నాళ్లూ ఎవరికీ అంతుచిక్క లేదు. కానీ తాజాగా దాని వెనుక ఉన్న కొన్ని వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. తామనుకున్న కంపెనీకి కాంట్రాక్టును దక్కించడం కోసం చంద్రబాబు సర్కార్ అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది.
చట్టం ముందు దొరకకుండా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పక్కా ప్రణాళికతో అవినీతికి పాల్పడుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా బయటపడ్డ ‘నిబంధనల’ కుట్రలు. అధికారం చేతికి రాగానే మొదలుపెట్టిన ఆ అక్రమాల భాగోతం ఇది.
రింగ్ కాంట్రాక్టర్ల హవా
విద్యుత్ సంస్థలపై పడి దోచుకుతినడానికి చంద్రబాబు సర్కారులోని నేతలు సరికొత్త దారులు వెదుకుతున్నారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసం రసవత్తర డ్రామాలు ఆడుతున్నారు. వారికి తోడుగా విద్యుత్ సంస్థల్లో కొందరు కాంట్రాక్టర్లు రింగ్ (కూటమి) మాస్టర్లుగా ఏర్పడ్డారు. టెండర్ల విలువను పెంచేసి, ఎవరికి టెండర్ రావాలో వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేసి, అనుకున్న విధంగా టెండర్లు దక్కేలా చేసి ఆపైన వాటాలను దండుకుంటున్నారు.
తమ మాట వినని వారి టెండర్లను తామే తప్పుబట్టినట్టు నటించి, తమ వాటా కోసం బేరాలు సాగిస్తున్నారు. ఈ రింగ్ కాంట్రాక్టర్లు తమ కూటమిలో లేని సంస్థలు టెండర్లలో పాల్గొంటే వారిని ఏదో విధంగా అనర్హులుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అందుకోసం పాలకుల వద్ద నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు. బాబు సర్కార్‌లో ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన వ్యవహారం.
కొత్త బ్రహ్మాస్త్రం.. ‘మార్కులు’
టెండర్లను బడా సంస్థలకు కట్టబెట్టేందుకు, చిన్న, మధ్య తరహా కంపెనీలను కనీసం టెండర్ దాఖలు వరకూ కూడా రానివ్వకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రభుత్వం అర్హత పేరుతో తాజాగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. దానిపేరే ‘మార్కులు’. విద్యుత్ శాఖలో ఏ టెండర్ వేయాలన్నా ఆ కంపెనీకి విద్యుత్ సంస్థలు విధించిన నిబంధన ప్రకారం 150కి గానూ 113 మార్కులు రావాలనేది ఇన్నాళ్లూ ఉన్న నిబంధన.
దీనివల్ల ఏ కంపెనీ అయినా తమకున్న వనరులు, పరిధులను బట్టి టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాటిని 124కు పెంచేశారు. అంటే ఆ మేరకు నిబంధనలు అదనంగా జత చేశారు. దీనివల్ల చిన్న, మధ్య తరహా సంస్థలేవీ టెండర్లలో పాల్గొనలేవు.
చెప్పేదొకటి.. చేసేది మరొకటి
నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ వైర్లు, ఇతర విలువైన సామాగ్రి(మెటీరియల్) ఏది అవసరమైనా అందులో 50 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల నుంచే తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎంఎస్‌ఎంఈలకు ఎలాంటి కాంట్రాక్టు దక్కకుండా చేస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని అడ్డగోలు టెండర్ల తీరు..
బూడిద టెండర్‌లో గోల్‌మాల్
నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తికి వాడే బొగ్గు నుంచి వచ్చే బూడిద టెండర్లలో కమిషన్ కోసం కూటమి ఎమ్మెల్యే పెద్ద కథే నడిపారు. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ రూ.270 కోట్ల అంచనా విలువతో ‘చెరువు బూడిద రవాణా’ ఈ–టెండర్‌ను పిలిచింది.
ఇందులో ఎల్1, ఎల్2, ఎల్3గా వచ్చిన వారికి రూ.90 కోట్ల చొప్పున పనులు అప్పగిస్తుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు థర్మల్ ప్లాంట్‌కు చుట్టుప్రక్కల 300కి.మీ. పరిధిలో ఈ బూడిదను సరఫరా చేయాలి. అయితే కాంట్రాక్టర్ అర్హత ప్రమాణాలను అయిన వారి కోసం అనుకూలంగా మార్చేశారు. ఈ విషయం నెల్లూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేకు తెలిసింది.
కొన్ని ఇంజినీరింగ్ సంస్థలు ఆ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాయి. దీంతో వెంటనే ఆయన జెన్‌కోకు లేఖ రాశారు. టెండర్‌పై వచ్చిన ఫిర్యాదులను ఆ లేఖలో పేర్కొంటూ, అధికారులను వివరణ కోరారు. చివరికి టెండర్ వేసిన కాంట్రాక్టర్‌తో బేరం కుదుర్చుకుని ఫిర్యాదు చేసిన వారినే తిరిగి బెదిరించారు.
సబ్ స్టేషన్ టెండర్‌లో రింగ్
ఏపీ ట్రాన్స్‌విుషన్ కార్పొరేషన్‌లో ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.60.21 కోట్లకు టెండర్ పిలిచింది. కానీ ఇక్కడ ఏకంగా రూ.6.68 కోట్లు పెంచేశారు. నిజానికి రూ.60.21 కోట్ల టెండర్లోనే ఆ సంస్థల లాభాలు కూడా ఉంటాయి. అదనంగా ఎందుకు పెరిగిందని ఆరాతీస్తే.. బాబు ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధితో మూడు సంస్థలు టెండర్ దక్కించుకోవడం కోసం ముందే బేరాలు కుదుర్చుకున్నాయని తెలిసింది.
భవ్య కోసం... ‘టెండర్’
ఏపీజెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఉన్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి కోసమంటూ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు టెండర్ అప్పగించారు. అయితే మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు.
కానీ మూడవ సారి పిలిచిన టెండర్లలో అవేవీ లేవు. భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్‌కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు ఇంతకన్నా తక్కువ కోట్‌చేశాయి. అయినా కాదన్నారు.
మరో విశేషం ఏమిటంటే ఆర్టీపీపీలో వైద్య సేవల కోసం యశోదా హాస్పిటల్ నెలకు రూ.11.50 లక్షలు ఇస్తే చేస్తామంటే వద్దని, భవ్యకు రూ.15.57 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఒక్కో ప్రాజెక్టు వద్ద దాదాపు 3,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మూడేళ్ల టెండర్ కాలంలో దాదాపు రూ.100 కోట్లను భవ్యకు కట్టబెడుతున్నారు.
సీఆర్‌డీఏ టెండర్లలో భారీ పెంపు
సీఆర్‌డీఏ పరిధిలో నిర్మించే సబ్ స్టేషన్లు, లైన్ల మార్పులపై నాలుగు టెండర్లను పిలిచారు. వీటిలో 132 కేవీ, 220కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు పలు లైన్ల ఏర్పాటు పనులు ఉన్నాయి. వీటన్నిటి విలువ రూ.1,800 కోట్లు కాగా రూ.2,100 కోట్లకు టెండర్ల విలువ పెంచేశారు. బీఎస్‌ఆర్ ఇఫ్రా, యూనివర్శల్ కేబుల్‌కు అండర్ గ్రౌండ్ కేబుల్స్ టెండర్ రూ.990 కోట్లది రూ.1100 కోట్లకు ఇచ్చారు. 400కేవీ లైన్ మార్పు పనులు రూ.350 కోట్లది పీవీఆర్ కనస్ట్రక్షన్స్, కేఆర్‌కు రూ.390 కోట్లకు ఇచ్చారు.
220 కేవీ సబ్ స్టేషన్ జీవీపీఆర్‌కు రూ.215 కోట్లది రూ.237 కోట్లకు ఇచ్చారు. నేలపాడు 220 కేవీ సబ్ స్టేషన్ రూ.240 కోట్లది రూ.280 కోట్లకు ఇచ్చారు. కర్నూలు జిల్లా భావనాసి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, ఏలూరు జిల్లా కొప్పాక, విజయనగరం జిల్లా భోగాపురంలో 220 కేవీ సబ్‌స్టేషన్లు రూ.200 కోట్లు విలువ కాగా రూ.230 కోట్లకు టెండర్లు వేశారు.
లింగయ్యపాలెం జీఐఎస్ టెండర్
సీఆర్‌డీఏ పరిధిలోని లింగయ్యపాలెంలో 220/33 కేవీ గ్యాస్ ఇన్సూ్యలేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) నిర్మాణం చేపట్టాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. దానికి రూ.267.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి ఓ కార్పొరేట్ సంస్థకు టెండర్‌ను అప్పగించింది. కాకినాడ సెజ్‌లో నిర్మిస్తున్న 400కేవీ సబ్ స్టేషన్ల పనులను రెండు సంస్థలు జాయింట్ వెంచర్‌గా టెండర్ వేస్తే వాళ్లకు అప్పగించారు.
కానీ లింగయపాలెం సబ్ స్టేషన్‌కు మాత్రం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని అనుసరించారు. చిత్రమేమిటంటే కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో జేవీలుగా టెండర్ దక్కించుకున్న సంస్థలే ఇక్కడ విడివిడిగా టెండర్లు దాఖలు చేశాయి. అయితే, మంత్రి అండతో రింగ్ మాస్టర్లుగా మారిన కొందరు కాంట్రాక్టర్లు ఇతర సంస్థలను టెండర్లలో పాల్గొననివ్వలేదు.


