ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్‌ ఈఈ | Yadagirigutta Temple Engineer Caught By ACB Accepting ₹1.9 Lakh Bribe For Contractor Bills | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్‌ ఈఈ

Oct 30 2025 10:53 AM | Updated on Oct 30 2025 11:24 AM

ACB Caught Yadagirigutta Temple Electricity Department EE

 ప్రసాదం మెయింటనెన్స్‌ మిషన్ల 

కాంట్రాక్టర్‌ వద్ద డబ్బులు డిమాండ్‌

రూ.1.90లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

9 నెలలు సస్పెండ్‌ అయ్యి.. 

 ఏప్రిల్‌లోనే తిరిగి ఉద్యోగంలోకి..

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్‌ ఈఈ రామారావు కాంట్రాక్టర్‌ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్‌ టెండర్‌ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్‌రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్‌రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. 

రూ.2లక్షలు ఇస్తేనే..
అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్‌ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్‌రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్‌రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్‌రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్‌రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

గతంలో 9 నెలలు సస్పెండ్‌.
యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్‌రావు విచారణ చేసి రామారావును సస్పెండ్‌ చేశారు. 9 నెలలు సస్పెండ్‌కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్‌ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. 

ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్‌ఈ..?
ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టుకు రామారావును ఇన్‌చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్‌ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్‌ విభాగంలో ఇన్‌చార్జి ఎస్‌ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుతో కలిసి ఇన్‌చార్జి ఎస్‌ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. 

ఇంట్లో సోదాలు
ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు  తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement