నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్‌వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,338 మంది విద్యార్థులకుగాను 3241 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. దీంతో ఒక్క సీటుకు 40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగిందని పేర్కొన్నారు.
24న అర్చక ఉద్యోగుల సమావేశం
రామగిరి (నల్లగొండ) : ఈ నెల 24న దర్వేశిపురంలో అర్చక ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు అర్చక ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ డీవీఆర్.శర్మ తెలిపారు. శనివారం నల్లగొండలోని తులసీ నగర్ భక్తాంజనేయస్వామి ఆలయంలో అర్చక ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అర్చక ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం చెల్లించాలని కోరారు. దూప, దీప నైవేద్యం అర్చకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ చిలకమర్రి శ్రవణ్‌చార్యులు, పెన్నా మోహనశర్మ, మామిళ్లపల్లి రాంబాబుశర్మ, జి.హరీష్‌శర్మ, మోహనాచార్యులు, షటగోపాలచార్యులు, జి.శేఖర్, మహేష్, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. ఆ తర్వాత కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘సీసీ’లో పర్యవేక్షించి.. సమస్యలు తెలుసుకొని
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ విభాగాల్లో తిరుగుతూ, సీసీ టీవీలో పర్యవేక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ముఖ మండపం, ప్రసాద వితరణ, పశ్చిమ రాజగోపురం వద్ద, భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొండపైన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. శనివారం సీసీ పుటేజీలను పరిశీలించి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వసతుల కల్పన, ప్రసాద వితరణ సజావుగా జరిగేలా చూడాలని వారికి సూచించారు.
ఆకట్టుకున్న నృత్యాలు
భువనగిరి : భువనగిరి మండలం రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మీరా నాట్య గురువు పూజిత శిష్య బృందం భరత నాట్యం ప్రదర్శించి అలరించారు. తమ అభినయంతో సందర్శకులను మొప్పించారు. కార్యక్రమంలో కళాకారిణిలు తరుణి అరుషి, భావిక, నిహిత, తనస్వి, వైష్ణవి, శరత్ తదితరులు పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు


