నాయకుల హల్‌చల్ అపుడే మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి
సాక్షిప్రతినిధి, నల్లగొండ
నాయకుల హల్‌చల్ అపుడే మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వివిధ రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని పార్టీల కేడర్‌లో అయోమయమూ నెల కొంది. ఏపార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుం టుంది..? ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనుంది..? సిట్టింగ్ ఎమ్మెల్యేల పరి స్థితి ఏమిటి..? అన్న ప్రశ్నలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఆయా పార్టీల కేడర్‌లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బిల్లు పాసయ్యాక ఏర్పాటయ్యే తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా, లేక సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికలుంటాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానము ఏదీ లేదు. మరో వైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పొత్తా.., విలీనామా.. అన్న చర్చ జరుగుతోంది. ఇంకో వైపు టీడీపీ, బీజేపీల పొత్తు ప్రచారమూ తెరపైకి వచ్చింది. దీంతో పార్టీల శ్రేణుల్లో రకరకాల సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు కేవలం మూడు నాలుగు నెలలే గడువు ఉండడంతో కొందరు నేతలు కొత్త సంవత్సరం ఆరంభం నుంచే తమ మనోభవాలను తెలియజేస్తూ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వారంలో కనీసం నాలుగైదు రోజులు తన నియోజకవర్గంలో ఏదో ఒక అధికారిక పర్యనట పెట్టుకుంటున్నారు.
అభివృవద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. కొత్త ఏడాది రెండో రోజే కోమటిరెడ్డి తన మనసులోని మాట బయట పెట్టారు. నియోకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు. తన పనితీరును పరిశీ లించి వచ్చే ఎన్నికల్లో కనీసం 80వేల మెజారిటీతో తనను గెలిపిస్తానని నియోజకవర్గ ప్రజలు తనకు హామీ ఇస్తేనే బరిలో ఉంటానని ప్రకటించారు. మామిళ్లగూడెంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమం ద్వారా ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులూ ముందు ముందుగానే తన అభిమతాన్ని తేటతెల్లం చేస్తున్నారు. బీజేపీతో ఆ పార్టీ పొత్తుకు వెళుతుం దని, సిట్టింగ్ స్థానాలనూ బీజేపీ సీనియర్ నేత ల కోసం కోరే అవకాశం ఉందన్న ప్రచారంతో టీడీపీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు.
వరస విజయాలతో భువనగిరిని టీడీ పీ సొంతింటిలా మార్చుకుంది. మాధవరెడ్డి, ఆయన మరణం తర్వాత ఉమామాధవరెడ్డి ఇక్కడి నుంచి సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని, భువనగిరి స్థానా న్ని తమకు కేటాయించాలని కోరనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగిన ట్లే బీజేపీ నాయకులు ఈ నియోజకవర్గపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి తన మనోబీష్టాన్ని వ్యక్తపరచాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తున్నా, లేకున్నా, ఈసారి కూడా తాను భువనగిరి నుంచే పోటీ చేయనున్నానని ఆమె ప్రకటించారు. ఒకే రోజు అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ గురించి ప్రకటించడం, వారు రానున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారన్న సంకేతాలను ఇస్తోంది. కాగా, పలువురు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజల్లో ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అటు అధికార పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తమ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెం ట్లను చుట్టవస్తున్నారు.నల్లగొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ సాధన కోసం చేసిన కృషికి ఫలితంగా 80వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానని నియోజకవర్గ ప్రజలు భరోసా ఇస్తేనే బరిలో ఉంటా...
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,
నల్లగొండ ఎమ్మెల్యే