ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు.
హైదరాబాద్ : ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. గ త ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున ఎన్నికలు నిర్వహించారు. మరణించిన శోభా నాగిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. శోభా నాగిరెడ్డి భౌతికంగా లేకపోవడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.
ఉప ఎన్నికలో భూమా శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అఖిల ప్రియను ప్రకటించారు. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాగా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు.
ఎన్నికల షెడ్యూలు :
నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు
పరిశీలన - ఈనెల 22న
ఉపసంహరణ - ఈనెల 24న
పోలింగ్ - నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న