అత్యవసర సేవల్లో ఉన్న వారికి ఈ– పాస్‌లు

E-passes for those in emergency services - Sakshi

వ్యవసాయ రంగ ఉత్పత్తుల రవాణాలో ఉన్న వ్యక్తులకు కూడా..

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఈ పాస్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి హిమాన్షు శుక్లా, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న తెలిపారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

నిత్యావసరాలకు సంబంధించిన ప్రైవేట్‌ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులతోపాటు వ్యవసాయ, సహకార విభాగం ఈ నెల 26వ తేదీన జారీ చేసిన జీవో 289లో పేర్కొన్న వస్తు సేవల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న వారందరికీ ఈ పాస్‌లు ఇస్తారు.
పాస్‌ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు. అందువల్ల కనిష్టంగా 5, గరిష్టంగా ఇ–పాస్‌ జారీ నిబంధనలు, షరతులకు లోబడి పాస్‌లు మంజూరు చేస్తారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుంచి 11 వరకు) అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్‌తో పని లేదు.

అంతా ఆన్‌లైన్‌లోనే..!
 https:// gramawardsachivalayam. ap. gov.in/CVPASSAPP/CV/ CVOrganiza tion Registration పై క్లిక్‌ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పందన పోర్టల్‌ వెబ్‌లింక్‌ ( https:// www. spandana. ap. gov. in/) ద్వారా కూడా పాస్‌ పొందొచ్చు.
నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్‌ను ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఉద్యోగి మొబైల్‌ నంబర్‌కు పంపుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top