‘పసుపు–కుంకుమ’ కోసం ఆత్మాభిమానం చంపుకోలేం | Dwcra Groups Protest infront of Banks Anantapur | Sakshi
Sakshi News home page

పగలంతా బ్యాంకు గోడల కిందే పడిగాపులు సిగ్గుతో చచ్చిపోతున్నాం

Feb 14 2019 1:20 PM | Updated on Feb 14 2019 1:27 PM

Dwcra Groups Protest infront of Banks Anantapur - Sakshi

రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు

అనంతపురం  , ఓడీ చెరువు: అందరూ కచ్చితంగా బ్యాంకుకు రావాల్సిందేనని, లేకుంటే పసుపు – కుంకుమ డబ్బు ఇచ్చేది లేదని వెలుగు సీసీలు చెబుతుండటంపై మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. ఇంటివద్ద పనులతోపాటు చండిబిడ్డలను కూడా వదిలేసి బ్యాంకు వద్దకు వస్తే రోజుల తరబడి తిప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలంతా బ్యాంకు గోడల కింద వేచి ఉండాల్సి వస్తోందని, సిగ్గుతో చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. సీసీల వైఖరిని నిరసిస్తూ బుధవారం వారు మండల కేంద్రమైన ఓడీ చెరువులో ఏపీజీబీ బ్యాంకు వద్ద కదిరి – హిందూపురం రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీపీఐ నాయకులు మున్నా, చలపతి, బీసీ జనసభ మండల అధ్యక్షుడు ఎం.ఎస్‌.షబ్బీర్‌ వారికి మద్దతు పలికి సీసీల తీరును నిరసించారు. ఈ సందర్భంగా గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, మహమ్మదాబాద్‌క్రాసింగ్, భోగానిపల్లి, ఇనగలూరు, నల్లగుట్లపల్లి, నారప్పగారిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన పలువురు మహిళలు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

సాధారణంగా గ్రూపు లీడర్లు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తే సంఘంలో పంచుకుంటున్నామని, కానీ పసుపు – కుంకుమ చెక్కులు మార్చుకోవాలంటే అందరూ రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అన్ని పనులూ వదిలిపెట్టి ఇక్కడికొస్తే బ్యాంకు గోడల కింద ఉండాల్సి వస్తోందని, ఇలా ఎన్నిరోజులని ఆత్మాభిమానం చంపుకోవాలని గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, భోగానిపల్లి మహిళలు మహిత, శివమ్మ, నాగమణి, సరస్వతి, ధనలక్ష్మి తదితరులు వాపోయారు. మహిళలను గౌరవించడమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇలా తమను వేధిస్తున్న వెలుగు సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. దీంతో  ఏఎస్‌ఐ ఇషాక్‌ వచ్చి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారి కోపం తగ్గలేదు. చివరికి ఏపీజీబీ మేనేజర్‌ వెంకట్రావ్‌ వచ్చి వారితో మాట్లాడారు. తామేమీ మిమ్మల్ని బ్యాంకుల వద్దకు రావాల్సిందేనని చెప్పలేదని, సీసీల అంగీకారంతో తీర్మానం చేసుకుని బ్యాంకుకు వస్తే కచ్చితంగా మీరు చెప్పినట్లే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.

అందరూ రావాల్సిందే
సంఘాల్లోని ప్రతి మహిళా బ్యాంకు విధిగా హాజరు కావాల్సిందే. లేకుంటే డబ్బులు ఇచ్చేందుకు వీలు పడదు. ఇవి మా వెలుగు పీడీ నుంచి వచ్చిన ఆదేశాలు. మేము ఆ మేరకే నడుచుకుంటాం.
– శంకర్‌నాయక్, సీసీ, ఓడీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement