బెల్టు షాపుల్లో నకిలీ మద్యం విక్ర యిస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో ఎక్సయిజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నకిలీ మద్యం విక్రయాలు
Aug 13 2013 6:12 AM | Updated on Aug 24 2018 2:33 PM
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : బెల్టు షాపుల్లో నకిలీ మద్యం విక్ర యిస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో ఎక్సయిజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నకిలీ సరుకు నిల్వలను గుర్తించి, నిందితులను విచారించగా డొంకంతా కదిలింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల నకిలీ మద్యం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. ఆది, సోమవారాల్లో నిర్వహించిన దాడుల్లో రూ.2.80 లక్షల సరుకు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మాచర్ల ఎక్సయిజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.ఆదిశేషు వెల్లడించారు.
దుర్గి మండలంలో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని మాచర్ల ఎక్సయిజ్ సీఐ డి.శ్రీనివాసరావుకు ఆదివారం సమాచారం అందింది. వెంటనే ఆయన ఎన్‌ఫోర్‌సమెంట్ సిబ్బందితో కలిసి మండలంలోని కంచరగుంటకు వెళ్లారు. స్థానికుడు కొండలరావుకు చెందిన బెల్టుషాపును తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న 70 ఓటీ విస్కీ క్వాటర్ బాటిళ్లను స్వాధీనపర్చుకుని నకిలీవిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా వివిధ ప్రాంతాల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపాడు. ఈ మేరకు వినుకొండలో కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిల గృహాలపై దాడులు నిర్వహించి మరో 96 నకిలీ మద్యం క్వాటర్ బాటిళ్లను స్వాధీనపర్చుకున్నారు.
వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని వారు చెప్పిన సమాచారం ఆధారంగా ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ మధుబాబు, సీఐ దేవర శ్రీనివాస్, ఈఎస్‌ఐ స్క్వాడ్ సీఐ నహిమియాబాబు, సిబ్బంది ప్రకాశం జిల్లా సంతమాగులూరు వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలో 77 పెట్టెల్లో నిల్వ ఉంచిన (ఒక్కొక్క పెట్టెలో 48 బాటిళ్లు) స్వాధీన పర్చుకున్నారు. ఈ మద్యాన్ని విక్రయిస్తున్న వాసుదేవరరెడ్డి పరారీలో ఉన్నాడని, అతనిని అదుపులోకి తీసుకొని ఈ నకిలీ మద్యం రాకెట్ ను త్వరలోనే ఛేదిస్తామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం విక్రయాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిం దన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement