విజయవాడలో చిరుజల్లులు

Drizzle Brings Respite From Heat in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: వేడిగాలులు, సెగలు అల్లాడిపోతున్న విజయవాడ వాసులకు ఉపశమనం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ వాతావరణం చిరుజల్లులతో స్వాగతం పలికింది. నిన్నటి వరకు వడగాల్పులతో అట్టుడికిపోయిన బెజవాడ నగరం చిరుజల్లుల రాకతో చల్లబడింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన చిరుజల్లులతో విజయవాడ వాసులు ఉపశమనం పొందారు. గురువారం ఉదయం కూడా వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.

మరోవైపు ఈరోజు మధ్యాహ్నం ఇందిరాగాంధి మునిసిపల్‌ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో ఇలా చిరు జల్లులతో వాతావరణం చల్లబడడంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పాలనాపగ్గాలు స్వీకరిస్తున్న తరుణంలో విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహానేత తనయుడికి ప్రకృతి ఇలా స్వాగతం పలికిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top