‘రుణమాఫీ’పై నమ్మకం సడలుతోంది | doubt about on dwakra debt waiver | Sakshi
Sakshi News home page

‘రుణమాఫీ’పై నమ్మకం సడలుతోంది

Jun 10 2014 12:35 AM | Updated on Sep 29 2018 6:00 PM

‘రుణమాఫీ’పై నమ్మకం సడలుతోంది - Sakshi

‘రుణమాఫీ’పై నమ్మకం సడలుతోంది

దర్శిలో బ్యాంకర్ల తీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీపై నమ్మకం సడలుతోందని స్థానిక పొదుపు సంఘాల సభ్యులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.

దర్శి : దర్శిలో బ్యాంకర్ల తీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీపై నమ్మకం సడలుతోందని స్థానిక పొదుపు సంఘాల సభ్యులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. పొదుపు గ్రూపు సభ్యుల కథనం మేరకు... దర్శిలోని సాయిప్రసన్న పొదుపు గ్రూపు సభ్యులు పదేళ్లుగా స్థానిక స్టేట్ బ్యాంకులో డబ్బు పొదుపు చేస్తున్నారు.

వీరు పొదుపు చేయడం ద్వారా రుణాలు పొంది నెలవారీ కిస్తీలను సక్రమంగానే తిరిగి చెల్లిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించినప్పటికీ ఏ నెలా చెల్లింపులు ఆపలేదు. ఈ గ్రూపు ఖాతాలో ప్రస్తుతం రూ.1,03,500 పొదుపు సొమ్ము ఉంది. ఈ నేపథ్యంలో గ్రూపు సభ్యురాలు కె.ఏడుకొండలమ్మకు శుభకార్యం కోసం రూ.50 వేలు అవసరమైంది.
 
సభ్యులందరి అంగీకారంతో రుణం కోసం సోమవారం బ్యాంకుకు వెళ్లారు. సంబంధిత అధికారి ఒకరు అంగీకరించి రుణం మంజూరు చేస్తూ సంతకం పెట్టారు. అయితే శ్రీనివాస్ అనే మరో అధికారి రుణం ఇచ్చేదిలేదంటూ గ్రూపు సభ్యులతో దురుసుగా మాట్లాడారు. ఖాతాలో పొదుపు డబ్బు ఉన్నప్పుడు రుణాలు ఎందుకివ్వరని సభ్యులంతా ఆ అధికారిని ప్రశ్నించారు.
 
 గతంలో రూ.లక్ష రుణం తీసుకున్నారని, ఆ డబ్బులు కట్టి ఖాతాలో మిగిలిన నగదు తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో బాబు రుణమాఫీ ప్రకటన ఒట్టిమాటేనా అనుకుంటూ గ్రూపు సభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. పొదుపు చేసుకున్న డబ్బును తాము తీసుకున్న రుణానికి బ్యాంకర్లు జమ చేసుకుంటారేమోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
రుణమాఫీ అనుమానంగా ఉంది :ఎ.రాజ్యలక్ష్మి, సాయిప్రసన్న గ్రూపు లీడర్
 రుణం ఇవ్వకపోవడంతో మా బాకీలు రద్దు కావేమోనని భయమేస్తోంది. పొదుపు సొమ్ము జమ చేసుకుంటారేమోనని అనుమానంగా ఉంది. అధికారులు డ్వాక్రా రుణమాఫీపై నిజాలను భయటపెట్టడం లేదు.
 
పొదుపు డబ్బుతో ముడిపెడుతున్నారు :ఎన్.సుకన్య, సెకండ్ లీడర్
రుణాలకు, పొదుపు సొమ్ముకు సంబంధం లేదని చెప్పారు. రుణమాఫీతో బాకీలన్నీ రద్దవుతాయని చంద్రబాబు ప్రకటించారు. పొదుపును మాత్రం కట్టుకోమన్నారు. ఇప్పుడు మాత్రం పొదుపు డబ్బుతో రుణానికి ముడిపెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement