టీబీ లేకుండానే మందులిచ్చారు!

Doctors Given TB Medicines To Man Without Having TB - Sakshi

నాలుగు నెలలుగా నానాఅవస్థలు పడ్డ మహిళ

జీఎంహెచ్‌ ఎక్స్‌రే యూనిట్‌ సిబ్బంది నిర్వాకం

కృష్ణాజిల్లా, నూజివీడు : పట్టణంలోని జీఎంహెచ్‌ (అమెరికన్‌ ఆస్పత్రి)లోని ఎక్స్‌రే యూనిట్‌ సిబ్బంది ఒకరి ఎక్స్‌రే రిపోర్ట్‌ మరొకరికి ఇవ్వడంతో లేని టీబీ రోగానికి ఐదు నెలల పాటు మందులు మింగిన మహిళ ఉదంతమిది. ముసునూరు మండలం సూరేపల్లికి చెందిన కోకిలపాటి రజని (27) ఈ ఏడాది మే 30వ తేదీ అస్వస్థతగా ఉంటే వైద్యం కోసంపట్టణంలోని అమెరికన్‌ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరిశీలించి ఊపిరితిత్తులు ఎక్స్‌రే తీయించడంతో పాటు కొన్ని రక్తపరీక్షలు సైతం చేయించి నెమ్ము, టీబీ లక్షణాలున్నాయని చెప్పగా, డబ్బులు పెట్టుకోలేమని రజని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి వెళితే ఉచితంగా ఇస్తారని తెలిపారు.

దీంతో ఏరియా ఆసుపత్రిలోని టీబీ యూనిట్‌ వద్దకు వెళ్లగా వాళ్లు ఎక్స్‌రే చూసి టీబీ మందులు ఇచ్చేశారు. ఆ మందులు ఆమె వాడుతుండగా తీవ్ర స్థాయిలో నీరసానికి గురవ్వడం జరుగుతుండటంతో ప్రతి రోజూ గ్రామంలోనే సెలైన్‌ పెట్టించుకుంటూ నెట్టుకొస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమవుతుండటంతో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు శ్రీకాంత్‌ వద్దకు ఈ నెల 8న వచ్చి తన బాధ చెప్పుకోవడంతో ఆయన మళ్లీ ఎక్స్‌రే తీయించగా టీబీ ఏమీ లేదని తేలింది. అమెరికన్‌ ఆసుపత్రిలో తీసిన ఎక్స్‌రేను మంగళవారం డాక్టర్‌కు చూపించారు. ఆయన పరిశీలిం చి ఆ ఎక్స్‌రే బి.గోపయ్య అనే వ్యక్తిదని, దానిపై బి.గొప్పయ్య అని ఉందని చెప్పారు. అమెరికన్‌ ఆసుపత్రిలోని ఎక్స్‌రే యూనిట్‌ సిబ్బంది తప్పిదానికి రజనీ అవస్థపడాల్సివచ్చింది. బాధితురాలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.

టీబీ యూనిట్‌లోనూ నిర్లక్ష్యమే..
ఎక్స్‌రే రిపోర్టు తీసుకువచ్చినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కళ్లె పరీక్ష చేసి నిర్ధారించాల్సిన టీబీ యూనిట్‌ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందరి నిర్లక్ష్యానికి రజనీ నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top