సత్తా చాటిన సిక్కోలు బిడ్డ 

Dilip First Rank In Village Secretariat Exam Results - Sakshi

రైతు కుటుంబం నుంచి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గా..

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హత

సాక్షి,  కాశీబుగ్గ: పచ్చని పల్లెలో ఉమ్మడి కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ రాష్ట్ర స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చాడు.  హై స్కూలు విద్యను ప్రభుత్వ బడిలోనే చదువుకున్న ఈ పలాస యువకుడు బీటెక్‌ చదివి సచివాలయ పరీక్షల్లో ప్రతిభ చూపాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 4వ వార్డు పెసరపాడు గ్రామానికి చెందిన సంపతిరావు దిలీప్‌ (హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ 191301032712) 120.50/150 మార్కులు సాధించి పోస్టు కేటగిరీ –2 గ్రూప్‌–2 ఏ (సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టు)లో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. దీంతో అతని స్వ గ్రామం పెసరపాడులో పండగ వాతావరణం కనిపిం చింది. రైతు కుమారుడైన దిలీప్‌ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాడు. తండ్రితోపాటు పెదనాన్న చిన్నాన్నలు మొత్తం ఆరుగురు.. వారి పిల్లాపాపలతో 50మందితో ఉమ్మడి కుటుంబం వారిది. తల్లి ఈశ్వరమ్మ, తండ్రి కూర్మయ్య వ్యవసాయం చేస్తున్నారు.

సర్కారు బడిలో బలమైన పునాది..
దిలీప్‌ స్వగ్రామమైన పెసరపాడు ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకుని మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న చినబడం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్, ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (మెకానికల్‌ విభాగం) పూర్తి చేశాడు. పోటీ పరీక్షల కోసం గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. సచివాలయ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర నుంచి శ్రద్ధగా చదివి విజయం సాధించాడు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పడిన పునాది బలం వల్లే తాను ఇంత స్థాయికి వచ్చానని దిలీప్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారని, నిష్పక్షపాతంగా పరీక్షలు జరిపి, తనలాంటి సామాన్యులెందరికో ఉపాధి చూపారని పేర్కొన్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top